పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం భీమ్లా నాయక్ షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని వచ్చే నెల 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కరోనా పరిస్థితులు సర్దుకుంటే ఈ సినిమా ఆ రోజున థియేటర్లలలో సందడి చేయనుంది. ఇక అదే పరిస్థితులను బట్టే ‘హరి హర వీరమల్లు’ సినిమా కూడా తాజా షెడ్యూల్ నిమిత్తం సెట్స్ పైకి వెళుతుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు. పవన్ తొలిసారిగా చేస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ హిట్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన హరీష్ లొకేషన్స్ కు సంబంధించిన సన్నాహాలలో బిజీగా ఉన్నాడు. ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే భగత్ గా ఈ సినిమాలో పవన్ కనిపిస్తాడనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

పవర్ ఫుల్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ రోల్ ను హరీష్ చాలా స్టైలిష్ గా డిజైన్ చేశాడట. విలన్ పాత్ర కోసం చాలా పేర్లను పరిశీలించిన హరీశ్ చివరకు కోలీవుడ్ స్టార్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి’ పేరును ఫైనల్ చేశారట. పవన్ కళ్యాణ్ కూడా విజయ్ సేతుపతి ఎంపికపై ఓకే చెప్పడంతో హరీష్ కొద్దీ రోజులుగా చెన్నైలో ఉన్నట్లు ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. నెగటివ్ రోల్ పాత్రకి విజయ్ సేతుపతి అయితే కరెక్టుగా సరిపోతాడని భావించి, ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సేతుపతికి స్టోరీ వినిపించిన హరీష్ ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాడని తెలిసింది. విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు ‘మాస్టర్’, ‘ఉప్పెన’ సినిమాలతో బాగా చేరువయ్యాడు. సేతుపతి ఓకే చెప్పగానే అధికారికంగా ఓ పోస్టర్ ను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అంత సవ్యంగా సాగితే ఈ సినిమా ఆగస్టు నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *