▪️ బీసీల హక్కుల కోసం కొన‌సాగుతున్న‌ ‘ధర్మ దీక్ష’
▪️ చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం
▪️ ధర్మ దీక్షకు బీసీ సంఘాలనుంచి అనూహ్య మద్దతు

మంగళగిరి: బీసీల హక్కుల సాధనే లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ (BCY) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారంతో నాలుగో రోజుకు చేరుకుంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్ 11న ప్రారంభమైన ఈ ‘ధర్మ దీక్ష’కు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది.

కదులుతున్న బీసీ శ్రేణులు.. పెరుగుతున్న మద్దతు
ఈ దీక్షకు తొలి రోజునే జ్యోతిరావు ఫూలే, బీపీ మండల్ వారసులు హాజరై మద్దతు తెలపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండో రోజు నుంచి రాజకీయ పక్షాలు, సామాజిక సంఘాల తాకిడి పెరిగింది. ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంఘీభావం ప్రకటించగా, వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ దీక్షా స్థలిని సందర్శించి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు.

ప్రభుత్వ మౌనంపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం
రామచంద్ర యాదవ్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాస్తారోకోలు, ధర్నాలు మొదలయ్యాయి. “ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటం కాదు, కోట్లాది మంది బీసీల భవిష్యత్తు కోసం చేస్తున్న యజ్ఞం. ప్రభుత్వం ఇంకా మొండిగా వ్యవహరించడం సమంజసం కాదు” అని నేతలు హెచ్చరిస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే:
బీసీల అభ్యున్నతి కోసం రామచంద్ర యాదవ్ ప్రభుత్వం ముందు ఐదు ప్రధాన డిమాండ్లను ఉంచారు:

బీసీ రక్షణ చట్టం: బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తక్షణమే రక్షణ చట్టాన్ని అమలు చేయాలి.

అమరావతిలో భూ కేటాయింపు: రాజధాని అమరావతి ప్రాంతంలో బీసీల సామాజిక, విద్యా అవసరాల కోసం 1000 ఎకరాలు కేటాయించాలి.

కులగణన: రాష్ట్రంలో తక్షణమే శాస్త్రీయంగా సమగ్ర కులగణన చేపట్టాలి.

44 శాతం రిజర్వేషన్లు: విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.

కార్పొరేషన్లకు నిధులు: నామమాత్రంగా మారిన బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి బలోపేతం చేయాలి.

వెనకడుగు వేసే ప్రసక్తే లేదు: బోడె రామచంద్ర యాదవ్
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామచంద్ర యాదవ్, తన ఆరోగ్యం కంటే బీసీల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం పైన పేర్కొన్న ఐదు అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చి, అమలు చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏవైనా అవాంఛనీయ పరిణామాలు జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *