రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అతి తక్కువ టైంలోనే యూత్ లో ఎనలేని క్రేజీ సంపాదించుకొని యూత్ ఐకాన్ గా ఎదిగాడు. ఇప్పటివరకు తెలుగు సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన తొలిసారిగా చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 25న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఇప్పటికే అక్కడ విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు, బాలీవుడ్ భామలు అలియా భట్, జాన్వీ కపూర్ లాంటి వారు సైతం విజయ్ అంటే తమకు ఎంతో అభిమానమని, ఆయనతో నటించేందుకు సిద్ధమని ప్రకటించారు.

ఈ క్రమంలోనే విజయ్ సోమవారం ఉదయం నుంచి ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నాడు. తన ట్విట్టర్ హ్యాండిల్ ను ‘విజయ్ దేవరకొండ తూఫాన్’గా మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఈ ‘తూఫాన్’ (TOOFAN) అంటే ఏమిటనే దానిపై సినీ వర్గాలు, అభిమానులు చాలా క్రేజీ అయిపోయారు. ఇది కొత్త సినిమా పేరా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ తూఫాన్ పై క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ కూల్ డ్రింక్ ‘థమ్స్ అప్’ కమర్షియల్ యాడ్ కు విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. దీనికి సంబంధించే విజయ్ ట్విట్టర్ హ్యాండిల్ ను మార్చాడు. అంతేకాదు థమ్స్ అప్ యాడ్ కు సంబంధించిన ఫొటో కూడా వచ్చింది. సముద్రం బ్యాక్ గ్రౌండ్ లో షిప్ మీదున్న విజయ్… చేతిలో థమ్స్ అప్ పట్టుకుని నిలబడ్డాడు. దీనికి కాప్షన్ గా ‘సాఫ్ట్ డ్రింక్ కాదు ఇది తూఫాన్’ అని రాసి ఉంది.

‘థమ్స్ అప్’ కంపెనీ తమ కమర్షియల్ యాడ్ కోసం కోట్లాది రూపాయలు కుమ్మరిస్తారు. ఇప్పటివరకు ఈ కంపెనీకి తెలుగులో బ్రాండ్ అంబాసిడర్స్ గా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులు వ్యవహరించారు. వీరిద్దరి తరువాత ఆ అవకాశం ఇప్పుడు విజయ్ కే దక్కింది. ఈ యాడ్ తెలుగులో మొదట చేసిన చిరంజీవికి ఆ కంపెనీ కోటి రూపాయలు ఇచ్చినట్లు ఫిలిం వర్గాలు చెబుతుండగా
మహేష్ బాబు 5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ కంపెనీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న విజయ్ కోసం 10 కోట్లు చెల్లించినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. లైగర్ లుక్ లో విజయ్ చేసిన ఈ యాడ్ కుమ్మేసింది అంటూ అభిమానులు సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద విజయ్ ‘థమ్స్ అప్’ బ్రాండ్ అంబాసిడర్ కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *