పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 335 కోట్లకు పైగా వసూల్ చేసి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న బన్నీ పుష్ప పార్ట్ 2 కోసం సిద్దమవుతున్నాడు. నార్త్ ఇండియా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టడంతో సుకుమార్ రెండవ పార్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. కరోనా పరిస్థితులు సర్దుకుంటే ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నారు. సాధారణంగా సుకుమార్ సినిమా రిలీజ్ డేట్ చివరి నిమిషం వరకు కష్టపడుతుంటారు.

లాస్ట్ మినిట్ తలనొప్పులు లేకుండా ఈ సినిమాని ఆగష్టు చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరా బరిలో దింపాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన వారం గ్యాప్ లోనే బన్నీ తన తరువాతి చిత్రాన్ని మొదలుబెట్టనున్నాడు. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిన సినిమాకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథని బోయపాటి మల్టీ స్టారర్ గా మార్చారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో కీలకపాత్ర చేయనున్నట్టు టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ తరహాలో ఈ సినిమా బీబీబీగా రానుందని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి.

ఈ వార్తలపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి లీకులు అందుతున్నాయి. ఈ సినిమా తరువాత బన్నీ తమిళ స్టార్ దర్శకుడు అట్లితో సినిమా చేయనున్నాడని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ‘రాజా రాణి’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన అట్లీ ఆ తరువాత ఇళయ దళపతి విజయ్ తో తేరి, మెర్సల్. బిగిల్ లాంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలను తీశాడు. ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో లయన్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అట్లీ డైరెక్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అట్లి చెప్పిన లైన్ నచ్చడంతో ఓకె చెప్పిన బన్నీ ఫుల్ స్క్రిప్టుతో రమ్మని చెప్పారట. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటన ఉగాదికి రానున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *