ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఇచ్చిన సూపర్ హిట్ తో జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తో స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు నవీన్ పోలిశెట్టి. క్యారెక్టర్ ఏదైనా తన మార్క్ కామెడీ ఉండేలా సిల్వర్ స్క్రీన్ పై రెచ్చిపోతున్నాడు. ఈరెండు సినిమాలు తెచ్చిపెట్టిన పేరుతో ఇప్పుడు వరసుగా మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మనోడు. నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చింది యువి క్రియేషన్స్. నిజానికి ఎప్పట్నుంచో మహేష్ డైరెక్షన్ లో అనుష్కతో కలిసి నవీన్ పోలిశెట్టి సినిమా ఉండబోతోందని ప్రచారం జరిగింది. దీనిని యువి క్రియేషన్స్ ఇంకా పట్టాలెక్కించకపోయే సరికి అందరూ ఈ సినిమా ఉంటుందా ఉండదా అనుకున్నారు. అయితే, నవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కనున్న చిత్రం ఈ నెలాఖరు నుంచే పట్టాలెక్కనుందని నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్‌ ప్రకటించింది. కథానాయకుడిగా నవీన్‌కి ఇది మూడో చిత్రం కాగా, అనుష్క 48వ చిత్రంగా రూపొందుతోంది. ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రమిదే. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతోంది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ అనే టైటిల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాని తెలుగు , తమిళ భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లుగా టాక్. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది యవి క్రియేషన్స్ సంస్థ. ఇందులో నవీన్ పోలిశెట్టి మైక్ పట్టుకుని స్జేజ్ పైన ఉన్నాడు. దీన్ని బట్టీ చూస్తుంటే ఇందులో స్టాండప్ కమెడియన్ గా చేయబోతున్నట్లుగా అర్ధం అవుతోంది. మనోడి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అందులోనూ క్యారెక్టర్ అదే అయితే, సిల్వర్ స్క్రీన్ పై రచ్చ రచ్చే అంటున్నారు ఫ్యాన్స్. కామెడీతో పిచ్చెక్కిస్తాడని, అందులోనూ ఇలాంటి సీన్స్ చేయడం , అనర్గళంగా మాట్లాడుతూ , స్పాంటినిటీతో జోక్స్ వేయడం అనేది నవీన్ కి చాలా ఈజీ అని అంటున్నారు.
ఈ సినిమాతో పాటుగా, నవీన్ ఇంకో సినిమా కూడా చేస్తున్నాడు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నవీన్‌ పొలిశెట్టి కో మరో సినిమాకి కమిట్ అయ్యాయి. కల్యాణ్‌శంకర్‌ అనే యువ దర్శకుడు ఈ సినిమాతో డైరెక్ట్ గా పరిచయం అవుతున్నాడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాకి నిర్మాతలు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతోంది.
ప్రేక్షకులు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయత్తం అవ్వండి, మేం వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాం’’ అంటూ చిత్రయూనిట్ ప్రకటించేసరికి, ఈ సినిమాతో నవీన్ మరో స్థాయిలో ఎంటర్ టైన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *