నటీనటులు: త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్ తదితరులు.
సాంకేతిక బృందం:
రచన – దర్శకత్వం: కొండల్
నిర్మాత: కాండ్రేగుల గోవిందు
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వీరభద్ర క్రియేషన్స్
మాటలు: వై. అమ్మిరాజు
ఛాయాగ్రహణం: నిమ్మల జయపాల్ రెడ్డి
కూర్పు: ఛోటా కె. ప్రసాద్
సంగీతం: కనిష్క
కథేంటంటే..
సినిమా ప్రారంభంలోనే శ్రీవల్లి (తన్వి నేగి) తన కారులో రెండు బాడీలను తీసుకుని ఓ ఫార్మ్‌హౌస్‌కు చేరుకోవడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నతో కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది.
హైదరాబాద్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో కొత్తగా పెళ్లైన దంపతులు సాగర్ (యశ్వంత్ పెండ్యాల), శ్రీవల్లి నివసిస్తుంటారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసే సాగర్ పనిఒత్తిడి కారణంగా భార్యతో భావోద్వేగంగా, శారీరకంగా దూరమవుతుంటాడు. అదే సమయంలో ఎదురింటికి కెనడా నుంచి వచ్చిన యువకుడు కార్తీక్ (త్రినాథ్ వర్మ) పరిచయం అవుతాడు. అతని చలాకీతనం, ఆప్యాయత, వ్యక్తిత్వానికి ఆకర్షితురాలైన శ్రీవల్లి క్రమంగా అతనికి దగ్గరవుతుంది.
తాను వివాహిత అయినప్పటికీ ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కాక శ్రీవల్లి తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతుంది. మరోవైపు కార్తీక్ ఆమెకు ప్రేమను వ్యక్తం చేస్తూ తనతో కెనడా రావాలని కోరుతాడు. ఇదే సమయంలో సాగర్ గురించి కొన్ని భయంకరమైన నిజాలు శ్రీవల్లికి తెలుస్తాయి. ఆ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి? రెండు మృతదేహాల వెనుక అసలు కథ ఏమిటి? కార్తీక్ ఉద్దేశం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం వెండితెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?
ప్రారంభ సన్నివేశంతోనే దర్శకుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాడు. రెండు మృతదేహాల మిస్టరీతో మొదలయ్యే కథ తొలి భాగంలో నెమ్మదిగా పాత్రలను పరిచయం చేస్తూ ముందుకు సాగుతుంది. గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవనశైలి సహజంగా అనిపిస్తాయి. మధ్య మధ్యలో బిత్తిరి సత్తి, సూర్యతేజల కామెడీ మంచి రిలీఫ్‌ను ఇస్తుంది.
సెకండాఫ్ ఈ చిత్రానికి అసలైన బలం. ఫస్టాఫ్‌లో వేసిన ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానాలు ఇస్తూ, ప్రేక్షకులు ఊహించని మలుపులతో దర్శకుడు కథను ఆసక్తికరంగా నడిపించారు. ప్రతి ట్విస్ట్ కథను ముందుకు తీసుకెళ్లడానికే ఉపయోగపడుతుంది. ఫస్టాఫ్‌లో పాత్రలపై ఏర్పడిన అపోహలను సెకండాఫ్‌లో పూర్తిగా తొలగిస్తూ కథను కొత్త కోణంలో చూపించడం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
సమాజంలో చోటుచేసుకుంటున్న కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు కథను రూపొందించారు. ముఖ్యంగా క్లైమాక్స్ వరకు అసలు నేపథ్యాన్ని దాచిపెట్టి ప్రేక్షకుల్లో ఉత్కంఠను కొనసాగించడం అభినందనీయం. అంతేకాదు, సాధారణంగా థ్రిల్లర్ చిత్రాల్లో కనిపించే పోలీస్ పాత్ర లేకుండానే కథను నడిపించడం దర్శకుడి ప్రత్యేకతను చాటుతుంది.
అయితే కొన్ని సన్నివేశాలు ఇంకాస్త వేగంగా సాగి ఉంటే బాగుండేదనే భావన కలుగుతుంది. ఫస్టాఫ్‌లో కొన్ని ఎపిసోడ్స్ కొద్దిగా నెమ్మదిగా అనిపించినా, సెకండాఫ్ ఆ లోటును పూర్తిగా భర్తీ చేస్తుంది.

నటీనటుల ప్రతిభ
త్రినాథ్ వర్మ కార్తీక్ పాత్రలో సహజమైన నటన కనబరిచారు. పక్కింటి యువకుడిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
యశ్వంత్ పెండ్యాల మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న సాగర్ పాత్రను చాలా సహజంగా పోషించారు.
ఈ చిత్రానికి ప్రధాన బలం తన్వి నేగి. భావోద్వేగాలు, అంతర్మథనం, ధైర్యం… ఇలా అనేక కోణాలున్న శ్రీవల్లి పాత్రలో ఆమె నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది.
సహర్ కృష్ణన్ తన పాత్రలో గ్లామర్‌తో పాటు నటనతో మెప్పించింది. కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, సూర్యతేజ తదితరులు తమ పాత్రల పరిధిలో మంచి నటన కనబరిచారు.
సాంకేతికంగా…
నిమ్మల జయపాల్ రెడ్డి ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా మలిచారు. ఛోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ కథకు అవసరమైన వేగాన్ని అందించింది.
కనిష్క అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను మరింత బలపరిచింది. ‘మనసా… మనసా’, ‘మధురమా…’ పాటలు శ్రావ్యంగా ఉన్నాయి.
నిర్మాత కాండ్రేగుల గోవిందు కథకు తగ్గట్టుగా నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీపడలేదు. పరిమిత బడ్జెట్‌లోనూ సినిమా రిచ్‌గా కనిపించేలా నిర్మించారు.
‘అదే నీవు అదే నేను’ కేవలం ప్రేమకథ కాదు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య నమ్మకం, భావోద్వేగ బంధం, ప్రేమలోని బాధ్యతను థ్రిల్లింగ్ కథనంతో చెప్పిన చిత్రం. ఫస్టాఫ్‌లో నెమ్మదిగా మొదలైన ప్రయాణం, సెకండాఫ్‌లో ఊహించని మలుపులతో మరింత ఆసక్తికరంగా మారుతుంది. ట్విస్టులు, భావోద్వేగాలు, బలమైన మహిళా పాత్ర, చివర్లో ఇచ్చే సందేశం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.
రొమాంటిక్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘అదే నీవు అదే నేను’ ఒక మంచి థియేట్రికల్ అనుభూతిని అందించే చిత్రంగా చెప్పొచ్చు.
రేటింగ్: 3.5/5
