రీసంట్ గా విడుదల అయిన సినిమాలు అన్నీ కూడా అనుకున్నంత కలక్షన్స్ ని సాధించ లేకపోతున్నాయనే చెప్పాలి. కొన్ని హిట్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ కి వచ్చేవరకూ నానా తంటాలు పడుతున్నాయి. దీంతో ప్రొడ్యూసర్స్ సినిమాలని రిలీజ్ చేసేందుకు రెండు మూడు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికి ఆచార్య సినిమానే పెద్ద ఉదాహరణగా చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చఱణ్ ఇద్దరూ కలిసిన సినిమా , అందులోనూ అపజయాలు లేని డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో వస్తోంది. దీనివల్ల ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కానీ, బాక్సాఫీస్ దగ్గర మాత్రం బొక్క బోర్లా పడిపోయింది. బయ్యర్స్ కి నష్టాలని మిగిల్చింది. దీంతో మెగాస్టార్ స్వయంగా రంగంలోకి దిగి ఈ సమస్యని పరిష్కరించాల్సి వచ్చింది. ఇంకా చాలా ఏరియాల్లో లాస్ ని భర్తీ కూడా చేయలేకపోయారు. ఇక ఈ సినిమా తర్వాత నేచరల్ స్టార్ నాని అంటే సుందారనికి సినిమా మంచి టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ తీస్కుని రాలేకపోయింది. చాలా ఏరియాల్లో నష్టాలని మూటగట్టుకుంది ఈ సినిమా. ఆ తర్వాత ఓటీటీ పుణ్యమా అని కొద్దిగా పాసైపోయిందనే చెప్పాలి. ఇప్పుడు డిజిటల్ గా వస్తున్న మార్కెట్ వల్ల కొద్దో , గొప్పో ప్రొడ్యూసర్స్ ఒడ్డున పడిపోతున్నారు. కానీ, థియేటర్స్ లో రిలీజ్ చేసినా ఎగ్జిబిటర్స్, బయ్యర్స్ మాత్రం కోట్లలో నష్టపోతున్నారు. అందుకే, థియోటర్స్ లో పెద్ద సినిమాలు తీస్కోవాలంటేనే బయపడే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రొడ్యూసర్స్ కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ పై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో కొత్త కొత్త కాన్సెప్ట్స్, కథలు పుట్టుకొస్తున్నాయి. అందుకే, ఓటీటీల్లో వచ్చే థ్రిల్లర్స్, క్రైమ్ ఓరియెంటెడ్ సినిమాలు, కొత్త కాన్సెప్ట్ తో కూడిన కథలని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఇక రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చూడాలంటే బొర్ కొట్టేస్తుంది. వాళ్లు ఎంతటి స్టార్ హీరోలు అయినా సరే, తర్వాత చూడచ్చులే అని థియేటర్స్ కి రావడం మానేశారు.
ఇక కరోనా తర్వాత కొన్ని రోజులు థియేటర్స్ కి వచ్చినా, బడ్జెట్ చూసుకునే వాళ్లు మాత్రం టిక్కెట్ కాస్ట్ ని చూసి వెనకడుగు వేస్తున్నారు. అందులోనూ టిక్కెట్ రేటుకే సంవత్సరం సబ్ స్క్రిప్షన్ ఓటీటీల్లో ఇస్తుంటే దానికే మొగ్గు చూపుతున్నారు. ఇంట్లోనో హోమ్ థియేటర్ చేసుకుంటున్నారు. దీనివల్ల రెగ్యులర్ రొటీన్ రొట్ట కొట్టుడు సినిమాలు మాకు వద్దు అంటూ ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. అందుకే, కమర్షియల్ హంగులతో హడావుడి చేసే సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ ని మూట గట్టుకుని భారీ మొత్తంలో నష్టపోతున్నాయి.
దీనికి ఉదాహరణ జులై నెలలో ఇప్పటివరకు ఎక్కువ సంఖ్యలోనే సినిమాలు విడుదల అయితే
ఈ సినిమాలలో ఒక్క సినిమా కూడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందనే చెప్పాలి. ఇక భారీ బడ్జెట్ సినిమాలు ఆగష్టులో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరి వీటిలో ఏది బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందనేది ఆసక్తికరం. అంతేకాదు, ప్రేక్షకుల నుంచి మాత్రం సినిమాలపై ఆసక్తి చూపకపోవడానికి సంబంధించి ఆసక్తికర కారణాలు వినిపిస్తున్నాయి. టికెట్ రేట్లను తగ్గిస్తున్న నిర్మాతలు అదే సమయంలో మల్టీప్లెక్స్ లలో స్నాక్స్ పేరుతో జరుగుతున్న దోపిడీని కూడా అరికట్టాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. దీనిని బట్టీ చూస్తే రెగ్యులర్ ఫార్ములాతో సినిమా చేస్తే అది ఖచ్చితంగా బోల్తా కొట్టేస్తుందనే అర్ధం. దీంతో
సరైన కంటెంట్ తో సినిమాలను తెరకెక్కించాలని నిర్మాతలు కోరుకుంటున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ లేకుండా సినిమాలను తెరకెక్కిస్తే సినిమాలు హిట్టయ్యే అవకాశం ఉండదని చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిర్మాతలు కంటెంట్ పై దృష్టి పెట్టకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వృథానే అవుతాయి. స్టార్ హీరోల సినిమాలే ఇలా ఉంటే, ఇక మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు అయితే సరేసరి. ఏ మాత్రం హెవీ బడ్జెట్ పెట్టి తీసినా కూడా తీరని నష్టాలే వస్తాయనేది వాస్తవం. మరి ఇప్పుడున్న పరిస్థితి ఎన్నాళ్లు కంటిన్యూ అవుతుందనేది చూడాలి. అదీ మేటర్.
