కరోనా నేపథ్యంలో పుష్ప, అఖండ చిత్రాలు సినీ పరిశ్రమకు ప్రాణం పోశాయి. ఈ రెండు సినిమాలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు రావడంతో బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ రెండు సినిమాలు సాధించిన విజయాలతో పాన్ ఇండియా చిత్రాలను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో పెద్ద చిత్రాలు వాయిదా పడటంతో 2022 సంక్రాంతికి నాగార్జున నటించిన బంగార్రాజుతో పాటు కొత్త హీరోలు నటించిన చిత్రాలు వచ్చాయి. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడ్ వర్గాల నుంచి ఇంట్రస్టింగ్ విషయాలు బయటికి వచ్చాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కోసం సంక్రాంతి రేస్ నుంచి సైడ్ అయ్యింది. సంక్రాంతి నుంచి భీమ్లా తప్పుకోవడంతో బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద చేస్తున్న సందడి అంత ఇంత కాదు. నాగ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా ఈ సినిమా కలెక్షన్స్ ను రాబడుతోంది. లడ్డు లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్న భీమ్లా నాయక్ ను ఎట్టి పరిస్థితులలోనూ ఫిబ్రవరి 25న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం రాదే శ్యామ్ కూడా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాని మార్చి 18న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా హిందీ హక్కులు సొంతం చేసుకున్న పంపిణీదారులకు కూడా మార్చి నెలలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ చెప్పిందంటూ టాక్ నడుస్తోంది.

రాధే శ్యామ్ విడుదలైన రెండు వారాలకు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల కానుంది. ఈ సినిమాని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. ఆచార్య విడుదలైన రెండు వారాలకు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ రిలీజ్ కానుంది. ఈ సినిమాని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన సంగతి గురించి చెప్పుకోవాలంటే ‘కేజీఎఫ్’ పార్ట్-2 రిలీజైన రెండు వారాలకు మోస్ట్ అవైటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుంది. ఈ సినిమాని ఏప్రిల్ 28న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట. బాహుబలి-2 రిలీజ్ రోజునే ఆర్ఆర్ఆర్ విడుదల చేస్తుండటం విశేషం. . ఇక వీటన్నిటి తర్వాత మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట మే 13న విడుదల చేయాలని ప్లాన్ చేశారు.2022లో విడుదలయ్యే టాప్-6 చిత్రాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ రావడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా 6 భారీ చిత్రాలు వస్తుండటంతో ఇండస్ట్రీలోనూ సందడి వాతావరణం నెలకొంది. కరోనా పరిస్థితులు సర్దుకుంటే ఆయా డేట్స్ కే భారీ చిత్రాలు రానున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *