రణ్ వీర్ సింగ్, దిపికా పదుకొనే కాంబినేషన్ అంటే ఎప్పుడూ క్రేజీ కాంబినేషనే. అయితే, ఈసారి కపిల్ దేవ్ బయోపిక్ అందులోనూ క్రికెట్ బ్యాక్ డ్రాప్ కాబట్టి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, లాక్డౌన్ కారణంగా చాలాకాలం సినిమాకి ఎన్నో ఆవాంతరాలు వచ్చాయి. అయినా కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కబీర్ ఖాన్ సినిమాని తెరకెక్కించాడు. ఎన్నో అంచనాలతో ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

సినిమా కథేంటి :
1983 లో ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన పాయింట్. కేవలం క్రికెట్ ప్రేమించేవాళ్లు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకున్న సంఘటన అది. ఈ జనరేషన్ కుర్రాళ్లు అప్పటికి పుట్టలేదు కూడా. భారత క్రికెట్ జట్టు ఎదుర్కున్న అవమానాలు ఏంటి ? దానికి కపిల్ దేవ్ చెప్పిన సమాధానం ఏంటి ? గెలుపు ఇచ్చిన వెలుగుల్లో మెరిసిన ముఖాలు, విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఎగిసిన క్షణాలు ఇవన్నీ వెండితెరపై చూస్తే ప్రేక్షకుల్లో ఎనలేని భావోద్వేగాలు. అదే ఈ సినిమా. అలాంటి అనుభూతిని పొందాలంటే 83 సినిమాని చూడాల్సిందే.
ఇండియన్ టీమ్ ఇంగ్లాండ్ కి ప్రపంచకప్ పోటీలకి రావడంతో కథ స్టార్ట్ అవుతుంది. వార్మప్ మ్యాచ్ లలో ఓడిపోవడం, ఆ తర్వాత మళ్లీ పుంజుకోవడం, కపిల్ దేవ్ కీలకమ్యాచ్ లో ఫైటింగ్, ఇంగ్లాండ్ తో సెమీస్ గెలవడం, వెస్టిండీస్ పై కప్ గెలవడం ఇవన్నీ సినిమాలో మనకి కళ్లకి కట్టినట్లుగా చూపించారు.

ప్లస్ పాయింట్స్ ఏంటి : +++

సినిమా మేకింగ్ సినిమాని నిలబెట్టింది. అత్యద్భుతంగా సినిమాని వెండితెరపై చూస్తుంటే 83లో లైవ్ లో మ్యాచ్ లు చూడలేని వాళ్లు చూసినట్లుగా అనిపించింది. నిజానికి ప్రపంచ కప్ గెలుస్తామని ప్రేక్షకులుగా మనకి ముందే తెలుసు, అయినా కూడా సినిమాలో ఉత్కంఠని కలిగించిన తీరు డైరెక్టర్ కబీర్ ఖాన్ వర్క్ సినిమాకి హైలెట్. సరదాగా సాగుతూనే ఎమోషనల్ గా గుండెకి హత్తుకునేలా సన్నివేశాలని మలిచారు. ఇది సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. ఆర్ట్ డిపార్ట్ మెంట్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోశాయి. కపిల్ దేవ్ గా రణ్ వీర్ నటన మరో స్థాయిలో ఉంది. శ్రీకాంత్ క్యారెక్టర్ లో జీవా ఇరగదీశాడు. అలాగే మేనేజర్ గా త్రిపాఠి నటన సినిమాకి హైలెట్.

మైనస్ పాయింట్స్ ఏంటంటే : —

అక్కడక్కడా సన్నివేశాలు డ్రమెటిక్ గా అనిపిస్తాయి. కావాలని ఈ సన్నివేశం పెట్టారా అని అనిపిస్తుంది. అలాగే, సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది. మరింత ఆసక్తిగా సెకండ్ హాఫ్ ని మలిచి ఉంటే బాగుండేది. కొంచెం స్లో న్యారేషన్ వల్ల క్రికెట్ అభిమానులకి బాగానే ఉంటుంది కానీ, మిగతా ఆడియన్స్ కి కొద్దిగా విసుకు అనిపిస్తుంది.

ఫైనల్ గా చెప్పాలంటే :

1983 ప్రపంచ కప్ దేశానికి ఎంతో గర్వకారణం. అలాంటి కప్ గెలిచిన సన్నివేశాలని గుండెల నిండా నింపుకుని ప్రేక్షకులుగా మనం థియేటర్స్ లో నుంచీ బయటకి వస్తాం. సెంచరీ కొట్టిన ఉత్సాహం, బౌండరీ బాదిన ఆనందం, సిక్సర్ కొట్టిన సంబరం మన ముఖంలో కనిపిస్తుంది. క్రికెట్ అభిమాని తప్పకుండా చూడాల్సిన సినిమా 83.

పరిటాలమూర్తి
రేటింగ్ 3.5 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *