విద్యార్థిని బలి తీసుకున్న దారణ ఘటన ఇది. సాక్ష్యాలు చెరిపేసిన సిబ్బంది అరెస్టు అయిన ఘటన. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీ చైతన్య శారదా భవన్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య కారణమైన 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో గన్నవరం డిఎస్పి చలసాని శ్రీనివాసరావు, పెనమలూరు సిఐ జె వెంకట రమణ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్టకు చెందిన మొల్లి పవన్ కుమార్ (17), తోటి విద్యార్థి హేమంత్ స్నేహంగా ఉండేవారు.
గతేడాది డిసెంబరులో వారి మధ్య వివాదం తలెత్తింది. హేమంత్ మంచివాడు కాదని, అతనితో మాట్లాడవద్దని తోటి విద్యార్థులకు పవన్‌కుమార్ చెప్పాడు. ఈ నేపథ్యంలో హేమంత్‌తోపాటు కళాశాల హాస్టల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు జనవరి 5వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పవన్ కుమార్ రూమ్‌కు వెళ్లి ఆయనను కొట్టారు. దీన్ని వీడియోతీసి ఇన్స్ట్రాలో పోస్టుచేశారు. జనవరి 30న మళ్లీ దాడి చేసి కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన పవన్ కుమార్ జనవరి 31వ తేదీ సాయంత్రం స్టడీ అవర్‌కు వెళ్లకుండా తనను కొట్టి అవమానించిన ఆరుగురు విద్యార్థుల పేర్లను తన చేతి మణికట్టుపై రాసుకుని హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఫ్లోర్ ఇన్‌ఛార్జి రవీంద్ర, మెస్ బారు హేమంత్, జూనియర్ లెక్చరర్లు రాజేష్, ఆనంద్, కృష్ణ సంఘటన స్థలానికి వెళ్లారు. విషయం బయటపడితే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో రూమ్‌లో ఉన్న పిల్లలందరినీ బయటకు పంపించేసి పవన్‌కుమార్ చేతి మణికట్టుపై ఉన్న పేర్లను సిబ్బంది చెరిపేసి సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించారు. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఆత్మహత్యకు కారణాలను కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచింది.
మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరపడంతో విషయాలు వెలుగుచూశాయి. ఆత్మహత్యకు కారణమైన ఆరుగురు విద్యార్థులను, సాక్ష్యాలు తారుమారు చేసిన కళాశాలకు చెందిన ఆరుగురి సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డిఎస్పి చలసాని శ్రీనివాసరావు తెలిపారు. పవన్ కుమార్‌ను చంపిన వారిని అరెస్టు చేయాలి అనకాపల్లి జిల్లాలో ధర్నా పవన్ కుమార్ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని, మృతుని కుటుంబానికి కళాశాల యాజమాన్యం కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, ప్రజా సంఘాలు, బంగారుమెట్ట గ్రామస్తుల ఆధ్వర్యంలో అనకాపల్లిలోని శ్రీ చైతన్య కాలేజీ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. పవన్ కుమార్‌ను శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న సీనియర్ విద్యార్థులు దారుణంగా కొట్టి చంపారని తెలిపారు. ఈ ఘటనను కాలేజీ యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ మృతుని కుటుంబీకులను తప్పుదోవపట్టిస్తోందన్నారు.
