మాజీ శాసనసభ్యుడు, KPRIT విద్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నిర్మాతగా, సాయిప్రగతి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వేదవ్యాస్’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా యూనిట్ సభ్యులు ప్రసిద్ధ ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి, సమర్పకులు కె. అచ్చిరెడ్డి, కథానాయకుడు పిడుగు విశ్వనాథ్‌లతో పాటు సహ నిర్మాత మేడపాటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొని గణనాథుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ మండప నిర్వాహకులకు నిర్మాత ప్రతాప్‌రెడ్డి విరాళం చెక్కును అందజేశారు.

దర్శనానంతరం నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘వేదవ్యాస్’ టీమందరం కలిసి ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, దర్శకుడు కృష్ణారెడ్డి గారు సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించారని తెలుపుతూ త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని వెల్లడించారు. ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు నిండుగా ఉండాలని దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి ఆకాంక్షించగా, సమర్పకులు కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని కృష్ణారెడ్డి గారు రూపుదిద్దారని పేర్కొన్నారు.

ఈనాటి ‘జెన్-జీ’ (Gen-Z) తరానికి కనెక్ట్ అయ్యేలా, నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో మన వేదాలు, సంస్కృతీ సాంప్రదాయాల ప్రాధాన్యతను చాటిచెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందిందని హీరో పిడుగు విశ్వనాథ్ తెలిపారు. మొదటి సినిమానే ఎస్.వి. కృష్ణారెడ్డి వంటి దిగ్గజ దర్శకుడితో చేసే అవకాశం రావడం ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహమేనని, వచ్చే ఏడాదికల్లా తనను మంచి హీరోగా నిలబెట్టాలని ఆ మహా గణపతిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.
—-

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *