టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై బాలీవుడ్ దర్శకుడు రవి రాయ్ దారుణమైన విమర్శలు చేశాడు. ఇటీవలే మహేశ్ బాబు ఓ వేదికపై బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, “బాలీవుడ్ నన్ను భరించలేదు” అని బదులిచ్చారు. దీనిపై బాలీవుడ్ ఫిలింమేకర్ రవి రాయ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కరోనా సంక్షోభం తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు గడ్డుకాలం నడుస్తోందని తెలిపారు. దీన్ని ఎవరూ కాదనలేరని అన్నారు. “బ్రహ్మోత్సవం’ స్టార్ మహేశ్ బాబు ‘బాలీవుడ్ నన్ను భరించలేదు’ అనే వ్యాఖ్యలను చేశారు. అలాంటి వ్యాఖ్యలు నిజమే అనిపించే స్థాయిలో బాలీవుడ్ దెబ్బతినలేదన్నది నా అభిప్రాయం. అదే వాస్తవం.

ఆ వ్యాఖ్యల పట్ల చింతించారో లేక, ఆ వ్యాఖ్యల పట్ల తప్పుగా ప్రచారం జరిగిందో తెలియదు కానీ ‘స్పైడర్’ హీరోకి నేను సవినయంగా చేసుకునే విన్నపం ఏంటంటే ఆయన దయచేసి బాలీవుడ్ కు వచ్చి తనను డైరెక్ట్ చేసే భాగ్యాన్ని కల్పించాలి. బాలీవుడ్ అతడిని ఎందుకు భరించలేదు? ‘ఆగడు’ నటుడు ఓసారి చరిత్రను గుర్తు చేసుకోవాలి. జెమినీ గణేశన్, శివాజీ గణేశన్ వంటి నటులకు బాలీవుడ్ హార్దికస్వాగతం పలికింది” అంటూ రవి రాయ్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకే గాక సినీ అభిమానులకు కోపాన్ని తెప్పించాయి.

మహేష్ బాబు స్థాయిని తగ్గించేందుకే బ్రహ్మోత్సవం, స్పైడర్, ఆగడు లాంటి ప్లాప్ చిత్రాలను రవి రాయ్ గుర్తు చేశారంటూ అభిమానులు మండిపడుతున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు అయినంత మాత్రాన మహేష్ పై విమర్శలు చేయడం తగదంటూ వారు రవి రాయ్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇక సినీ అభిమానులు అయితే టాలీవుడ్ లెజెండ్స్ గురించి మాట్లాడకుండా తమిళ సినీ పరిశ్రమకు చెందిన లెజెండ్స్ గురించి రవి రాయ్ ప్రస్తావించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాజమౌళి సినిమాతో మహేష్ స్టామినా ఏంటో బాలీవుడ్ జనాలకు తెలుస్తుందని వారు కామెంట్స్ చేస్తున్నారు. రవి రాయ్ చేసిన కామెంట్స్ పై మహేష్ బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *