ఈ నెల 1 నుంచి సినిమా షూటింగ్‌లు నిలిపి వేస్తున్నట్లు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. హీరోలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల పారితోషికాలు, వాళ్ల సిబ్బంది జీత భ‌త్యాలూ, ఎగ‌స్ట్రా ఖ‌ర్చులు ఇవ‌న్నీ భ‌రించ‌లేని నిర్మాత‌లు షూటింగ్స్ ను ఆపి చర్చలు జరుపుతున్నారు. పారితోషికం తగ్గింపు విషయంలో ఇప్పటికే స్టార్ హీరోలతో చర్చలు జరిపిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్‌ తాజాగా సహాయ నటుల రెమ్యునిరేషన్ విషయంపై చర్చలు జరుపుతోంది. కేవ‌లం సినిమా టికెట్ల రేట్లు పెంచ‌డం, సినిమా షూటింగ్‌ల‌ను నిలిపివేయ‌డం వ‌ల్ల వేల మంది సినీ కార్మికుల‌తో పాటు చిన్న నిర్మాత‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కానీ దిల్ రాజు నేతృత్వంలోని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్‌ మాత్రం షూటింగ్ లను నిలుపుదల చేసి మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)తోనూ రెమ్యునిరేషన్ విషయంపై చర్చలు జరుపుతోంది. ఇద్దరు సహాయ నటులను దృష్టిలో పెట్టుకొనే ప్రొడ్యూసర్స్ గిల్డ్స్ షూటింగ్ లను ఆపేసి చర్చలు జరుపుతున్నట్లు ఫిలిం వర్గాలు చెబుతున్నారు. వారు ఎవరో కాదు రావు రమేష్, మురళీ శర్మలు. వీరిద్దరూ ఏ పాత్రకైనా జీవం పోయగలరు. తండ్రి, సహాయ నటుడు, కామెడీ, విలన్ ఎలాంటి పాత్ర చేసినా ఆ పాత్రలలో వారు ఒదిగిపోతారు. దాంతో వారిద్దరూ డైలీ రెమ్యునిరేషన్ తీసుకుంటున్నారట. రావు రమేష్ రోజుకు 5 కోట్లు, మురళీ శర్మ అయితే 4 కోట్లు తీసుకుంటున్నారట. అంతవరకు బాగానే ఉన్నా తమకు స్పెషల్ కార్వాన్ కావాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారట.

అందుకు కూడా నిర్మాతలు ఓకే చెప్పినా తమ మేకప్, కాస్ట్యూమ్, అసిస్టెంట్ లకు కూడా డబ్బులు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారట. దాని వలన బడ్జెట్ పెరిగిపోతుందని నిర్మాతలు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)తో చెప్పినట్లు టాక్ నడుస్తోంది. వీరిద్దరి డిమాండ్లను నిర్మాతలు తీర్చలేక ఇబ్బందిపడుతున్నారని అందుకే షూటింగులకు బ్రేక్ పడినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సహాయ నటులు వీరిద్దరే కాదు మరో ఇద్దరు స్టార్ హీరోలపై కూడా ప్రొడ్యూసర్ గిల్డ్స్ కోపంగా ఉందట. నాని, శర్వానంద్ నటించిన చిత్రాలు ఈ మధ్య కాలంలో సరైన విజయాన్ని సాధించలేకపోయాయి. కానీ వారు సినిమా సినిమాకు తమ రెమ్యునిరేషన్ ,మాత్రం పెంచుకుంటూ పోతున్నారట. ఆ హీరోలతో సినిమాలు చేయమంటే చేయమని నిర్మాతలు మాతో చెప్పినట్లు తెలిసింది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగకతప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *