‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రం ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. గతంలో భారత్ లో అసహనం పెరిగి పోయిందని… ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోదామని తన భార్య తనతో చెప్పిందంటూ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందిని తీసుకొస్తున్నాయి. ఆమిర్ చిత్రాన్ని చూడొద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. #banlalsinghchadda అంటూ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో, తన చిత్రాన్ని అడ్డుకోవద్దని ఆమిర్ బహిరంగంగా అందరినీ కోరారు.

కానీ జరుగుతున్న ప్రచారం ఏ మాత్రం ఆగకపోవడం గమనార్హం. మరోవైపు ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. నాగ చైతన్య నటించడంతో నాగార్జున కూడా ఈ సినిమాని తన శక్తి మేరకు ప్రమోట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. “ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే… ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నారు. 2015లో ఆమిర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారు. భారత్‌లో అసహనం పెరిగిపోయిందని. ఆమీర్ అన్నారు. ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోంది.

గతంలో ఆమిర్ నటించిన ‘పీకే’ సినిమాలో సైతం హిందూ వ్యతిరేకతనే… ప్రధానంగా చూపించడమేగాక, హిందూ దేవుళ్లని అవమానించారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ అనే… ఇన్స్పిరేషనల్ మూవీతో ముందుకొచ్చారు. కానీ, దేశ వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఆయనకి గుర్తు చేస్తూ Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్‌తో… ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నారు. జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు… ఆమిర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీ షోల్లో పాల్గొంటున్నారు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలి” అంటూ వ్యాఖ్యానించారు. చిరంజీవి, నాగార్జునలపై ఆమె పరోక్షంగా చేసిన విమర్శలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *