అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి ఇద్దరు భార్యలు. ఇద్దరి భార్యలకి జుట్టు చాలా తక్కువగా ఉండేది. పెద్ద భార్యకి ఒక వెంటుక్ర ఉంటే, చిన్నభార్యకి రెండు వెంట్రుకలు ఉండేవి. దీంతో రాజుగారు చిన్నభార్య అంటేనే ఎక్కువగా మోజు పడుతూ ఉండేవాడు. దీంతో చిన్నభార్య ఎప్పుడూ పెద్దభార్యని హేళన చేస్తూ నీకు ఒకటే వెంట్రుక ఉంది ఉంటూ వెక్కిరించేది. చిన్నభార్య చేసే అవమానాలు తాళలేక పెద్దభార్య ఒకరోజు ఏడుస్తూ రాజ్యం నుంచీ బయటకి వెళ్లిపోయింది.
అలా రాజ్యం నుంచీ బయటకి వచ్చి అడవిలోకి వెళ్లిపోయింది. దారిలో ఒక మల్లెపొద రాణిగారికి కనిపించింది. ఆ మెల్లెపొద బాగా వాడిపోయింది. ఎందుకిలా అయిపోయావ్ అంటూ అడిగింది. దీంతో చాలారోజుల నుంచీ వర్షాలు లేవు, అందుకే నేను ఇలా వాడిపోయాను. దాహంగా ఉంది దయచేసి నాకు నీళ్లు పోయమని అడిగింది మల్లెపొద. దీంతో రాణిగారు దగ్గర్లో ఉన్న చెరువులోనుంచీ నీళ్లని తీస్కుని వచ్చి మల్లెపొదకి నీళ్లు పోశారు. మల్లెపొద బాగా సంతోషించింది. అలాగే, పక్కనే ఉన్న గులాబీ చెట్టు కూడా నాకు కూడా నీళ్లు కావాలని అడిగింది. దీంతో రాణి ఆ గులాబీ చెట్టుకి కూడా నీళ్లు పోసింది. వారి దగ్గర సెలవు తీస్కుని ముందుకు ప్రయాణం సాగించింది. ఒక దూడ అడవిలో తప్పిపోతూ కనిపించింది. ఆ దూడ ని తీసుకుని ఆవుతో కలిపి ఇద్దరికీ నీళ్లు తాగించి ముందుకు సాగింది.
అడవిలో ఒక మునీశ్వరుడు తపస్తు చేసుకుంటూ కనిపించాడు. ఆ మునీశ్వరుడికి పాదాభివందనం చేసింది. ఆ మునీశ్వరుడు కళ్లు తెరిచి చూసి, అమ్మా నువ్వు ఎవరు ? ఎక్కడి నుంచీ వచ్చావ్ అని అడిగాడు. నేను రాజుగారి పెద్ద భార్యని అని, చిన్నరాణి చేసిన హేళనని తట్టుకోలేక రాజ్యం విడిచి వచ్చానని మునీశ్వరుడుకి వినయంగా చెప్పుకుంది రాణి. మునీశ్వరుడు రాణి బాధని తెలుసుకుని ఒక పసుపు ముద్దని ఇచ్చి ఈ పసుపు రాసుకుని ఈ కోనేటిలో మూడు మునకలు వేసి రమ్మని చెప్పాడు. దీంతో శ్రద్ధగా మునీశ్వరుడికి నమస్కరించి పసుపు రాసుకుని కోనేటిలో మూడు మునకలు వేసింది రాణిగారు. చాలా విచిత్రంగా ఆమెకి పెద్ద జుట్టు వచ్చింది. ఒత్తైన జడ, నల్లని కురులు ఆమెకి వచ్చేసరికి పట్టరాణి సంతోషం కలిగింది. మునీశ్వరుడుకి వినమ్రంగా నమస్కరించి అక్కడ్నుంచీ రాజ్యానికి బయలు దేరింది.
మార్గం మద్యలో ఆవు తన పాలు తీస్కోమని కోరింది. అలాగే, గులాబీ చెట్టు , మల్లెచెట్టు పూలని ఇచ్చాయి. వాటిని తీసుకుని అంతఃపురానికి వచ్చింది. చక్కగా జడవేసుకుని సిగలో మల్లెపూలు పెట్టుకుని రాజుగారి దగ్గరకి వచ్చి పాలు ఇచ్చింది. అంతే, రాజు గారు ఆశ్చర్యపోయారు. ఇంత జుట్టు నీకు ఎలా వచ్చింది అని అడిగారు. అప్పుడు జరిగిన కథ అంతా చెప్పింది. అంతే చిన్నరాణికి ఇదంతా పెద్ద మాయలాగా అనిపించింది. అంతేకాదు, తను కూడా అలాగే చేద్దామని మనసులో అనుకుంది.
ప్రొద్దునే చిన్నరాణి అడవిలోకి బయలు దేరింది. మార్గం మద్యలో మల్లెచెట్టు నీళ్లు కావాలని అడిగింది. నేను రాణిని నీకు నీళ్లు పోయాలా పో, అంటూ అక్కడ్నుంచీ వెళ్లిపోయింది. అలాగే, గులాబీ చెట్టుకి కూడా నీళ్లు పోయలేదు. ఆవు-దూడకి కూడా నీళ్లు పెట్టలేదు. నేను ఈ దేశపు రాణిని అంటూ విర్రవీగింది. చెట్టు దగ్గర మునీశ్వరుడు కనిపిస్తే ఆయనకి నమస్కరించలేదు. ఆయన కళ్లు తెరిచి చూసి విషయం అడిగి తెలుసుకున్నారు. ఆమెకి కూడా పసుపు ముద్దని ఇచ్చారు. కోనేటిలోకి వెళ్లి ఈ పసుపు రాసుకుని మూడు మునకలు వేయమని చెప్పారు. దీంతో ఆశగా పసుపు రాసుకుని కోనేటిలోకి వెళ్లి మూడు మునకలు వేసింది చిన్నరాణి. ఆశ్చర్యంగా తనకి కూడా ఒత్తైన జుట్టు వచ్చింది. చిన్నరాణి మనసులో ఇంకో ఆలోచన మొదలైంది. పెద్దరాణి మూడు మునకలు వేస్తే పెద్ద జుట్టు వచ్చింది, నేను ఇంకో మునక వస్తే తనకంటే ఎక్కువ జుట్టు వస్తుంది కదా అని మరో మునక వేసింది. దీంతో ఉన్న రెండు వెంట్రుకలు కూడా పోయాయి. పూర్తిగా బోడి గుండు అయ్యింది. ఏడుస్తూ రాజ్యానికి బయలు దేరింది.
మార్గం మద్యలో ఆవు తన కొమ్ములతో కుమ్మింది. గులాబీ చెట్టు ముళ్లతో గుచ్చింది. మల్లెతీగ కొట్టింది. దీంతో మరింత బాధగా రాజ్యంలోకి వచ్చింది చిన్నరాణి. చిన్నరాణిని ఎవ్వరూ గుర్తుపట్టేలేదు. ఎవరు నువ్వు అంటూ రాజ్యంలో నుంచీ బయటకి పంపించేశారు.
కథలో నీతి : దురాశ దుఃఖానికి చేటు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *