సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రాంతి పండుగగా జరుపుతాం. సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారేటప్పుడు జరిపే పండుగే  మకర సంక్రాంతి.

మకర సంక్రాంతి రోజున, సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. మనకి ఆరోగ్యాన్ని , ఆయుష్షును ఇచ్చేది సూర్యభగవానుడే అని నమ్మేవారు సూర్యుడిని కొలిచేవారు ఈ రోజున సూర్యనమస్కారాలు చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడమని ప్రార్ధిస్తారు.

సూర్యనమస్కారాలు చేయడం అనేది ఒక ఆచారం. ఇటీవలి కాలంలో విదేశీయులు సైతం ఈ సూర్యనమస్కారాలను చేస్తూ , సన్ బాత్ అంటూ వివిధ ఆరోగ్యకరమైన కార్యక్రమాలను చేపట్టడం మన భారతీయ సంస్కృతి గొప్పతనం.

మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో – రధయాత్రలో ఘట్టాలు నాలుగు.  మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలు. వీటిలో మకరసంక్రమణాన్ని “సంక్రాంతి పండుగ”గా చెప్పుకుంటాం. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక లలో “సంక్రాంతి” అని, తమిళనాడు లో “పొంగల్” అని, మహారాష్ట్ర, గుజరాత్ లలో “మకర్‌సంక్రాంతి” అని, పంజాబు, హర్యానా లలో “లోరీ” అని ఈ పండగని పిలుస్తారు. కొత్తపంట చేతికి వచ్చిన తర్వాత పిడకలతో చేసిన భోగిమంటలపై కుండలలో పాలు పొంగించి ఈ ధాన్యంతో పొంగలి చేస్తారు కాబట్టే దీనిని సంక్రాంతి పొంగల్ అని పిలుస్తారు. ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకోవడం అనేది మనకి అనాదిగా వస్తున్న సంప్రదాయం.

భోగిపండుగ ఎందుకు..?

సంక్రాంతి పండగని మనం మూడురోజులపాటు జరుపుకుంటాం. మొదటి రోజును భోగి – రెండవ రోజు సంక్రాంతి- మూడవ రోజును కనుమగా ప్రతి సంవత్సరం ఈ పండుగను చేసుకుంటుంటాం.

భోగి రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వేస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాకుండా ఇంకో కారణము ఉంది. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంభించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వేసుకుంటారు. దీనివల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్లి పోయి , కొత్త పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలుంటాయి.

ఇంట్లో ఉన్నవారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఈ భోగిమంటలు చుట్టూ తిరిగి వాటిపై కాగపెట్టిన నీళ్లతో తలస్నానం చేస్తే తగ్గిపోతాయని, దుష్టశక్తులు లేదా పీడ ఏదైనా మనమీద ఉంటే అది తొలగిపోతుందని నమ్ముతారు. దీనినే భోగి పీడస్నానం అని కూడా ఇంట్లో పెద్దవాళ్లు చెప్తుంటారు.

ఏరునుగ్గుల(పొలాల్లో దొరికే పిడకలు) పై కొత్త కుండలో పాలు పొంగిస్తారు. పాలు పొంగిన తరువాత కొత్త బియ్యంతో పొంగలి చేసి చిక్కుడు ఆకుల్లో సూర్యునికి నైవేధ్యంగా పెడతారు. వాతావరణం చల్లగా ఉండే ఈరోజుల్లో వేడి వేడి భోగిమంటల చుట్టూ పాటలు పాడుతూ కోలాహలంగా జరిపే ఈ పండుగ కేవలం ఇంటికే కాదు గ్రామానికి సైతం మేలు జరుగుతుందని , గ్రామాల్లో ఉండే విషపురుగులు , క్రిమికీటకాదులు ఈ భోగిమంటల పొగవల్ల చనిపోతాయని చెప్తారు.  అంతేకాదు,  పితృదేవతలు ఊర్ధ్వలోకాలకు వెళ్లే మార్గాన్ని చూపించేందుకు వెలిగే కాంతులే ఈ భోగిమంటలని కూడా చెప్తారు.

పేరంటం :

సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.దీని లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు బంధువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.

కోడిపందాలతో కనుమ ఇచ్చే కిక్ ఇదే..!

కొత్త అల్లుళ్లతో , కొంటె మరదళ్లతో , కోడిపందాలతో , కోతపంటలతో కుటుంబం అంతా ఆనందంగా సంక్రాంతి రోజు పాలు పొంగించి, దానితో పిండివంటలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలికలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు ఇలాంటి నోరూరించే వంటకాలు చేసి, కొత్తబట్టలు కట్టుకుంటారు. ముఖ్యంగా కొత్త బియ్యంతో చేసే అరిసెలు సంక్రాంతి పండుగకి ట్రేడ్ మార్క్ పిండివంటగా చెప్పొచ్చు. ఈ అరిసెలను బియ్యం బెల్లంతో కలిపి చెయ్యడం వల్ల ఐరన్ విటమిన్ తక్కువగా ఉండే స్త్రీలకు సమృద్ధిగా ఐరన్ లభిస్తుంది. కొత్త బియ్యం తినడం వల్ల చలికాలం ఒళ్లు గట్టిబడి కొండలను సైతం పిండిచెయ్యగలిగే శక్తివస్తుందని విశ్వసిస్తారు.  

సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి.

ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.

కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో మనం వారికి ధాన్యం ఇస్తాము. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతులతో చిడతలు కొడుతూ తలపై రాగి పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.

ఇప్పటికీ హరిదాసులు పల్లెలలో సంచరిస్తూ కనులకువిందుగా , పండుగకు ముందుగా పాటలు పాడుతూ పండుగ ఉత్సాహాన్ని నింపుతారు. పల్లెలలో జరుపుకునే సంక్రాంతి పండుగు కొత్త అల్లుళ్లతో , లంగా ఓణీల అందాలతో ఎటు చూసినా సందడిగా ఉత్సాహంగా కనిపిస్తుంది. పశుసంపద ఎక్కువగా ఉన్న ఊళ్లలో వాటిని పూజించడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగకుండా ఉంటుందని ఈ పండుగను జరుపుతాం. ఆటపాటలతో ఊరూరా సంక్రాంతి పండుగు హోరెత్తిపోతుంది.

అంతేకాదు, ఈరోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.చాలామందికి ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వడమనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ కూడా దానం ఇస్తారు.

ఇక కనుమ పండుగకి చేసే సందడే వేరు..

యడ్లపందెంకోడిపందాలు….

కనుమ రోజు కాకిఅయినా మునక వేస్తుంది అని పెద్దలు అంటారు. అంటే ఆరోజు తలస్నానం చేసి  కొత్తబట్టలు ధరించి తమకు  వ్యవసాయంలో ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపుతూ వాటిని పసుపు కుంకుమలతో పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ.

కనుమ మరునాటిని ముక్కనుమ అని ఆరోజున కూడా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులు శ్రద్ధాసక్తులతో జరుపుతారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తోంది. మాంసా హారులు కాని వారు, గారెల తో  అంటే మినుములో  మాంసకృత్తులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకా హార మాంసం గా పరిగణించి సంతృప్తి పడతారు. కనుమ రోజున ప్రయాణాలు మానుకుంటారు. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం.

మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు. మనిషి శరీరం ఒక రథం వంటిదని, ఆ శరీరపు హృదయంలో పరమేశ్వరుడుంటే అతడు సజ్జనుడవుతాడని సంకేతం. ఒక రథం ముగ్గుతో మరో ఇంటివారి రథం ముగ్గుకి ముగ్గుతో తాడుని వేస్తూ కలుపుతూ పోతూంటారు. అందరం ఒకరికి ఒకరంగా వుంటూ, ఐకమత్యంగా వుంటూ, కలసి సహజీవనం సాగించాలని చెప్పడానికి అది సంకేతం.

సంక్రాంతి పండుగ వెనక పురాణ కథ తెలుసా..?

సంక్రాంతి ముగ్గులుగాలిపటాల సోయగాలు..!

రాళ్ళు రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టే చుక్కలు రాత్రి పూట కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యుడి  స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (స్టాటిక్‌ ఫోర్స్‌) ,చుక్కలు గతిశక్తి (డైనమిక్‌ ఫోర్స్‌)కు సంకేతాలని, ముగ్గులు శ్రీ చక్ర సమర్పణా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు.

ఇంటిముందు ఆవుపేడతో కలిపిన నీళ్లను చల్లడం వలన మనకు అనారోగ్యాన్ని కలిగించే బ్యాక్టీరియా ఇంటి లోపలికి రాదని అంటారు. ఆవు మనకు పూజనీయమైనది. ఆవు మూత్రం, ఆవుపేడ, ఆవుపాలు మనకు ఆరోగ్యాన్ని స్తాయి. అనేక రకాలైన వైరస్ లు మన ఇంట్లో , ఒంట్లో చేరనివ్వకుండా ఇవి కాపాడుతాయని పూర్వీకులు నమ్మేవారు.

అందుకే మనం నిత్యజీవితంలో ఆవును పూజిస్తాము. అలాగే మన గ్రామీణ వాతావరణంలో మహిళలు ముగ్గును వేయడానికి బియ్యంపిండిని వాడతారు. ఈ ఆచారంలో కూడా జీవ వైవిధ్యం మనకు స్పష్టంగా కన్పిస్తుంది. ఈ ముగ్గు పిండిగా వాడే బియ్యంపిండిని చీమలు, చిన్నచిన్న పురుగులు ఆహారంగా తీసుకుంటాయి. తోటి జీవులకు ఆహారాన్నివ్వడం మన సంస్కృతిలో ఒక భాగ మైంది. ముగ్గుల్లో గణితం కూడా ఇమిడి ఉంది. ఎందుకంటే చుక్కలు పెట్టేప్పుడు ఒక లెక్క ప్రకారం పెడతాం. అంటే చుక్కలుగానీ, గీతలు కానీ లెక్కగా పెడితేనే ముగ్గు సరిగా అందంగా వస్తుంది. ఆ చుక్కలు పెట్టే లెక్కలు సరిగా లేకుంటే ముగ్గు అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే మన సంస్కృతి, సంప్రదాయాలలో అందం,ఆరోగ్యంతోపాటు గణితం కూడా ఇమిడి ఉన్నాయనేది వాస్తవం.

ఇళ్ళముందు సంక్రాంతి ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు, పూలు, పసుపుకుంకుమలు జల్లి వాకిళ్ళను కళాత్మకంగా రూపొందిస్తారు. గుమ్మాలను మావిడాకులు, బంతిపూల తోరణాలతో అలంకరించి మరింత అందాన్ని చేకూరుస్తారు.

గ్రామాల్లో అప్పుడే కోతలు ముగిసి ధాన్యం ఇంటికి రాగా, ఏడాది అంతా చేసిన శ్రమ మాయమై కొత్త ఉత్సాహం ముఖాల్లో వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా గొబ్బెమలు ఇంటిముందు ఉంటే వాటి వాసన కారణంగా క్రిమికీటకాదులు రాకుండా ఉంటాయి. ఎటువంటి బ్యాక్టీరియా , వైరస్ లు ఇంటిలోపలకు రాకుండా కాపాడతాయని నమ్ముతారు. గొబ్బెమ్మను అలంకరించి వాటిచుట్టూ తిరుగుతూ గొబ్బీయల్లో గొబ్బీయల్లో అంటూ పాటలు పాడుతూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను చేసుకుంటారు.

సంక్రాంతి పండుగరోజు పట్టణవాసులకు ఆసక్తికరమైన క్రీడ గాలిపటాలు ఎగురవేయడం. చిన్నా పెద్దా అని తేడాలేకుండా రంగు రంగుల గాలిపటాలను ఎగురవేస్తూ ఆనందోత్సాహాలతో గాలిపటాల పండుగగా సంక్రాంతిని జరుపుతారు. మన ఇంటినుంచి ఎగిరే గాలిపటం వేరే వారి గాలిపటాన్ని తెంచితే ఆ ఆనందానికి హద్దే ఉండదు. గానా బజానాలతో దీనిని ఒక వినోద క్రీడగా చేసుకోవడం అనేది ఆనవాయితీగా మారింది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.., గాలిపటాలు ఎగరేసేటపుడు పెద్దలు పిల్లలని ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఎందుకంటే.. పైకి చూస్తూ పతంగిని ఎగరేసేటపుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.  

చాలామంది మహిళలు సంక్రాంతి నోము నోచుకుంటారు. పెద్దవాళ్లు, కుండలు, చిన్నపిల్లలు గురుగులు పెట్టి వాటిని చక్కగా అలంకరించి, అందులో నువ్వుల లడ్డూలు మొదలైనవి వేసి అమ్మవారి దగ్గరుంచి నోము నోచుకుంటారు. ప్రస్తుతం కుండల స్థానంలో రకరకాల ఆధునిక వస్తువులు వచ్చి చేరాయి. సాయంత్రం అందరినీ పేరంటానికి పిలిచి వాటిని వాయనంగా ఇస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గడిచిన నాలుగవ రోజున ముక్కనుమ వస్తుంది. ఈ రోజున కొత్తగా పెండ్లి అయిన మహిళలు ‘సావిత్రి గౌరివత్రం’ అంటే ‘బొమ్మల నోము’ పడతారు. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నైవేద్యం  పెట్టిన తర్వాత ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. ఇక సంక్రాంతినాడు ఎంత బాగా దానాలు చేస్తే అంత మంచి జరుగుతుందంటారు. అలాగే ఆ రోజున చిన్నపిల్లలు  పెద్దలకు పాద నమస్కారాలు చేయాలి.ఇలా పెద్దలను మొక్కడం ద్వారా పిల్లలకు వారి ఆశీస్సులు అందుతాయి. ఇలా మొక్కులకు సంబంధించిన పండుగ కనుకనే సంక్రాంతిని మొక్కుల పండుగ అని కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు అంటున్నారు.

పురాణ కథనాలు

పవిత్ర గంగానది భూమికి వచ్చిన రోజే మకర సంక్రాంతి. సాగర రాజు అరవై వేల పుత్రులు కపిల మహర్షి శాపానికి గురై భస్మములుగా మారిపోతారు.అప్పుడు వారి వారసుడు భగీరథుడు తన పితృ దేవతలకు పుణ్యలోకాల ప్రాప్తికై గంగా నదిని భువికి తెచ్చేందుకై మహా తపస్సుచేస్తాడు. మకర సంక్రమణం జరిగిన రోజున గంగా నది భూమిమీద ప్రవహించి వారి భస్మములకు ఉత్తమగతులు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అంతేగాకుండా మకర సంక్రాతి రోజునే శ్రీ మహావిష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చి, ధర్మస్థాపన చేశాడని , ద్వాపరయుగంలో భీష్మపితామహుడు అంపశయ్య మీదనుంచి ఈ సంక్రాంతిరోజునే పరమాత్మలో లీనమయ్యాడని పూర్వీకులు చెబుతారు. రావణాసురుడ్ని రాముడు చంపిన రోజని రావణకాష్టం అని కొన్ని ప్రాంతాలవారు భోగిమంటలను వేస్తారు.  

ఇంతటి విశిష్టమైన పండుగ శోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుకొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ, “సంక్రాంతి లక్ష్మి” ని ఆహ్వానిస్తూ ఉంటుంది. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాక, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి.ఇంత చక్కని ఆనందాన్ని మనకు అందించే “సంక్రాంతి” పండుగను ఘనంగా జరుపుతూ, ఇంటింటా సౌభాగ్యాలకు ఆలవాలమైన ఆ సంక్రాంతి లక్ష్మికి మనం ఆహ్వానం పలుకుదాం……..అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *