ఇస్రో మాజీ శాస్త్రవేత్త, క్రయోజెనిక్స్ డివిజన్ ఇన్చార్జిగా పని చేసిన పద్మభూషణ్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ‘రాకెట్రీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో మాధవన్ ఈ సినిమాని నిర్మించి నారాయణన్ పాత్రను ఆయనే పోషించారు. ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రాకపోయినా నటన పరంగా మాధవన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపించారు. అయితే ఈ సినిమా వల్ల మాధవన్ భారీగా నష్టపోయారని అప్పులు తీర్చేందుకు ఇంటిని అమ్ముకున్నారనే ప్రచారం జరుగుతోంది.

జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మాధవన్ స్పందించారు. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తాను తన ఇంటిని కానీ, మరేదాన్ని కానీ కోల్పోలేదని అన్నారు. ‘రాకెట్రీ’ సినిమాలో భాగస్వాములు అయిన వారందరూ ఈ ఏడాది మరింత ఎక్కువ ఆదాయపు పన్ను కట్టబోతున్నారని చెప్పారు. దేవుడి దయవల్ల తామంతా కలిసి ఒక మంచి చిత్రాన్ని తీశామని… గర్వించే స్థాయిలో లాభాలను పొందామని తెలిపారు. తన ఇల్లు తనకు చాలా ఇష్టమని… ఇప్పటికీ ఆ ఇంట్లోనో ఉన్నానని చెప్పారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దంటూ ఆయన కోరారు.

ఇక అమీర్ ఖాన్ నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా చిత్రంపై స్పందించిన మాధవన్ ప్రతి ఒక్కరూ హిట్ అవుతుందనే ఉద్దేశంతోనే సినిమాను నిర్మిస్తారని ఒక ఫెయిల్యూర్ సినిమాను తీయబోతున్నామనే భావనతో ఎవరూ సినిమా తీయరని అన్నారు. కరోనాకు ముందులా ఇప్పుడు ఆడియన్స్ లేరని… వారిలో చాలా మార్పు వచ్చేసిందని అన్నారు. థియేటర్లలో సినిమాలు ఆడేలా స్క్రీన్ ప్లేను పక్కాగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారని మాధవన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కథ, కథనం పర్ఫెక్ట్ గా ఉన్నాయి కనుకే బాహుబలి 1, బాహుబలి 2, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీ స్టార్ల సినిమాల కంటే బాగా ఆడాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *