మాస్ రాజా రవితేజ ఆల్ రౌండర్. కామెడీ ఎంత బాగా చేస్తారో? సీరియస్ రోల్స్‌లో అంతే ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ కనబస్తారు. ‘కిక్’ వంటి వినోదాత్మక చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ‘క్రాక్’ లాంటి కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో అలరించారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? దీంతో రవితేజ విజయం అందుకున్నారా? లేదా? ఇవాళ్టి రివ్యూ రిపోర్ట్ లో తెలుసుకుందాం.

రామారావు పాత్రలో రవితేజ నటించాడు. ఎంఆర్వో… డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆఫీసర్. ప్రజలకు సేవ చేయడం తన బాధ్యతగా భావించే వ్యక్తి. న్యాయం చేయడం కోసం అవసరం అయితే నియమ నిబంధనలు పక్కన పెట్టి మరీ పని చేస్తాడు. అందుకని అతడు అంటే అవినీతి అధికారులు, రాజకీయ నాయకులకు పడదు. అందువల్ల, తరచూ బదిలీలు తప్పవు. చివరకు సొంతూరు వస్తాడు. అప్పుడు తన చిన్ననాటి ప్రేయసి మాలిని, భర్త సురేంద్ర కొన్నాళ్ళ నుంచి కనపడటం లేదని రామారావుకు తెలుస్తుంది. సురేంద్ర మిస్సింగ్ కేసు పోలీస్ పాత్రలో నటించిన వేణు తొట్టెంపూడి పట్టించుకోవడం లేదని నేరుగా రామారావు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఒక్క సురేంద్ర మాత్రమే కాదని.. మొత్తం 20 మంది కనిపించకుండా పోయారని తెలుస్తుంది. వాళ్ళు కనిపించకుండా పోవడానికి, ఎర్ర చందనం అక్రమ రవాణాకు ముడి ఉందని అనుమానం వస్తుంది. కేసు దర్యాప్తు చేయకుండా ఎవరెవరో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. సొంత బాబాయ్ కొడుకు అనంత్ పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ చంపాలని అనుకుంటాడు. సొంత బాబాయ్ కొడుకు రామారావు మీద ఎందుకు అటాక్ చేశాడు? మనుషుల మిస్సింగ్ వెనుక ఎవరున్నారు? చివరకు రామారావు ఈ కేసును పరిష్కరించడా? లేదా? అనేది మిగతా సినిమా.

కొన్ని కథలు పేపర్ మీద బావుంటాయి. ఆ కథను పేపర్ మీద నుంచి స్క్రీన్ మీదకు వచ్చే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. కథలో సోల్ మిస్ అవుతుంది. స్కీన్ మీద సీన్‌తో, ఎమోష‌న్‌తో క‌నెక్ట్ కావ‌డం క‌ష్టంగా ఉంటుంది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ విషయంలో అదే జరిగింది. ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండవ రాసుకున్న క‌థలో కంటెంట్ ఉంది. కానీ, కంటెంట్ స్క్రీన్ మీదకు సరిగా రాలేదు. దీనికి ముఖ్య కారణం… డైరెక్షన్‌లో రియ‌లిస్టిక్ అప్రోచ్‌. ఇంకొక‌టి… లెంగ్త్‌. రెండున్న‌ర గంట‌ల సినిమా అయిన‌ప్ప‌టికీ… చాలా సేపు థియేట‌ర్ల‌లో ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఇంటర్వెల్ ముందు అసలు కథ మొదలవుతుంది. అప్పటి వరకు మధ్య మధ్యలో వచ్చే ఫ్యామిలీ సీన్స్ నిడివి పెంచాయి తప్ప పెద్దగా ఆకట్టుకోలేదు.

క‌నిపించ‌ని శ‌త్రువుతో క‌థానాయ‌కుడు యుద్ధం చేసేట‌ప్పుడు అత‌డి బాధ‌ను స్క్రీన్ ముందున్న ప్రేక్ష‌కుడు ఫీల్ కావాలి. ‘రామారావు ఆన్ డ్యూటీ’లో అటువంటి ఫీల్ క‌లిగించే సీన్స్ లేవు. క‌థానాయకుడు ఎవ‌రితో యుద్ధం చేస్తున్నాడు? అనే ఉత్కంఠ ఆడియన్స్‌లో క‌ల‌గాలి. అదీ జ‌ర‌గ‌లేదు. ఎమోష‌న్ మిస్ కావ‌డంతో ఏ సీన్ కూడా క‌నెక్ట్ అయ్యేలా లేదు. అయితే… ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండవ‌లో క‌మ‌ర్షియ‌ల్ సెన్స్ ఉంద‌ని ఫైట్స్ చూస్తే తెలుస్తుంది.

సామ్ సీఎస్ అందించిన స్వరాలలో… సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘బుల్ బుల్ తరంగ్’ వినసొంపుగా ఉంది. సొట్ట‌బుగ్గ‌ల… సాంగ్ కూడా! ఈ రెండు పాట‌ల‌నూ విదేశాల్లో చిత్రీక‌రించారు. అయితే… క‌థ‌కు, ఆ పాట‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టు అనిపించ‌దు. సినిమా ఒక స్టైల్‌లో ఉంటే… ఆ రెండు పాట‌లు మ‌రో స్టైల్‌లో ఉన్నాయి. రెగ్యులర్ ఐటమ్ సాంగ్స్‌కు కాస్త భిన్నంగా మెలోడీ ట్యూన్‌తో ‘నా పేరు సీసా’ రూపొందించడంలో దర్శకుడు శరత్ ప్రత్యేకత చాటుకున్నారు. సామ్ సీఎస్ నేప‌థ్య సంగీతంలో మెరుపులు ఏవీ లేవు. థీమ్ మ్యూజిక్ కొంచెం డిఫ‌రెంట్‌గా ఉంది. కంటెంట్ లెంగ్త్ ఎక్కువ కావ‌డంతో మ్యూజిక్‌తో హోల్డ్ చేయ‌లేక‌పోయారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బావుంది. సాహి సురేష్ సృష్టించిన 90వ దశకం నేపథ్యాన్ని చక్కగా తెరపైకి తీసుకొచ్చారు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

ర‌వితేజ త‌న స్ట‌యిల్ ప‌క్క‌న‌పెట్టి చేసిన చిత్ర‌మిది. క‌మ‌ర్షియ‌ల్ అంశాల కంటే క‌థ‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌, ఫైట్ లేకున్నా… రెగ్యుల‌ర్ హీరోయిజం చూపించే అంశాల కంటే డైలాగ్స్ చెప్పే సీన్స్ ఎక్కువ ఉన్నా… క‌థ‌పై, ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో చేశార‌ని సినిమా చూస్తుంటే అర్థం అవుతుంది. అయితే… కంటెంట్ వీక్ కావ‌డంతో ఆయ‌న చేయ‌గ‌లిగింది ఏమీ లేకుండా పోయింది. త‌న క్యారెక్ట‌ర్ వ‌ర‌కూ క‌రెక్ట్‌గా చేసినా ఆడియ‌న్స్‌కు ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్ క‌నెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే.

వేణు తొట్టెంపూడి చాలా ఏళ్ళ విరామం తర్వాత స్క్రీన్ మీద కనిపించారు. ‘సామి..’ అంటూ డిఫరెంట్ స్టైల్‌లో డైలాగులు చెప్పారు. ఆయ‌న క్యారెక్ట‌రైజేష‌న్ వీక్‌గా ఉంది. వేణు బ‌దులు ఆ పాత్ర‌ను ఎవ‌రు చేసినా పెద్ద వ్య‌త్యాసం ఉండ‌దు. నాజర్, రాహుల్ రామకృష్ణ, నరేష్, పవిత్రా లోకేష్ తదితర సీజనల్ ఆర్టిస్టులు పాత్రల పరిధి మేరకు చేశారు. ‘నా పేరు సీసా…’ పాటలో అన్వేషి జైన్ డ్యాన్స్, గ్లామర్ షో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేస్తాయి.

రెండు మూడు యాక్ష‌న్ సీన్స్‌, సాంగ్స్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ హిట్ చేయలేవు. ర‌వితేజ కోసం థియేట‌ర్ల‌కు వెళ్ళిన ప్రేక్ష‌కులు మాస్ రాజా శైలి అంశాలు లేక‌పోవ‌డంతో నిరాశ చెందుతారు. క‌థా నేప‌థ్యం బావున్న‌ప్ప‌టికీ నిదానంగా సాగిన క‌థ‌నం, ఏమాత్రం ఉత్కంఠ‌కు గురి చేయని, సాగ‌దీసిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో ప‌క్క చూపులు చూసేలా చేస్తాయి. ర‌వితేజ‌, శ‌ర‌త్ మండ‌వ విజయం కోసం మరో ప్ర‌య‌త్నం చేయక తప్పదు.
ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2 స్టార్స్ అవుటాఫ్ 5 స్టార్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *