మోస్ట్ ప్రెస్టీజియస్ ఆస్కార్ అవార్డుల తుది జాబితాను మంగళవారం ( ఫిబ్రవరి 8)న ప్రకటించారు. ఈసారి భారతీయ సినిమాలు ఆస్కార్ ఫైనల్ నామినేషన్లు పొందడంలో విఫలమయ్యాయి. కానీ, డాక్యుమెంటరీ విభాగంలో మాత్రం భారతీయులు ఆశలు సజీవంగా నిలిచాయి. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ‘రైటింగ్ విత్ ఫైర్’ నామినేట్ అయింది. ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని సుస్మిత్ ఘోష్, రింటు థామస్ రూపొందించారు. దళిత మహిళలు నిర్వహించే ‘ఖబర్ లహరియా’ అనే వార్తాపత్రిక గురించి ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరించారు.

‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సొంతం చేసుకుంది. ప్రఖ్యాత సండేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు, ఆడియన్స్ అవార్డు కైవసం చేసుకుంది. ఇక వివిధ విభాగాలకు ఖరారైన నామినేషన్ల వివరాలను నటి ట్రేసీ ఎల్లిస్ రాస్, కమెడియన్ లెస్లీ జోర్డాన్ మీడియాకు వెల్లడించారు. ఉత్తమ నటుడు విభాగంలో బెనెడిక్ట్ కంబర్ బాచ్ (ద పవర్ ఆఫ్ ద డాగ్), డెంజెల్ వాషింగ్టన్ (ద ట్రాజెడీ ఆఫ్ మాక్ బెత్), జేవియర్ బార్డెమ్ (బీయింగ్ ద రికార్డోస్), విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), ఆండ్రూ గార్ ఫీల్డ్ (టిక్, టిక్… బూమ్) నామినేట్ అయ్యారు.
ఉత్తమ నటి విభాగంలో పెనెలోప్ క్రజ్ (పారలల్ మదర్స్), క్రిస్టెన్ స్టీవార్ట్ (స్పెన్సర్), జెస్సికా చాస్టెయిన్ (ద ఐస్ ఆఫ్ టామీ ఫాయే), నికోల్ కిడ్ మాన్ (బీయింగ్ ద రికార్డోస్), ఒలీవియా కోల్మన్ (ద లాస్ట్ డాటర్) నామినేట్ అయ్యారు. సీనియర్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఉత్తమ దర్శకుడి విభాగంలో చాలా రోజుల తరువాత నామినేట్ కావడం విశేషం. జేన్ కాంపియన్ (ద పవర్ ఆఫ్ ద డాగ్), పాల్ థామస్ ఆండర్సన్ (లికోరైస్ పిజ్జా), స్టీవెన్ స్పీల్ బెర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ),ర్యుసుకే హమగుచి (డ్రైవ్ మై కార్), కెన్నెత్ బ్రనా (బెల్ ఫాస్ట్)లు ఉత్తమ దర్శకుల జాబితాలో నామినేట్ అయ్యారు. వీరిలో రెడ్ కార్పేట్ మీద నడిచి ఆస్కార్ ను ముద్దాడేది ఎవరనేది తెలియాలంటే మార్చి 27 వరకు ఆగలవలసిందే. ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం మార్చి 27న లాస్ ఏంజెలిస్ లోని డాల్బీ థియేటర్ లో నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *