గడిచిన వేసవిలో తీవ్రమైన ఎండను చవిచూసి.. మొన్న వానాకాలంలో తడిసిముద్దయిన భాగ్యనగరవాసులకు వణుకు పుట్టించే మరోవార్త. ఈ శీతాకాలం నగరం దట్టమైన మంచు దుప్పటి కప్పుకోనుంది. జనం చలికి వణికిపోవడం ఖాయంగా తెలుస్తోంది. డిసెంబర్ నెలలోనే నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అది కూడా మామూలు అల్పం కాదు.. 10 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేంత అత్యల్ప ఉష్ణోగ్రత. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5డిగ్రీల సెంటీగ్రేడ్ వైపునకు వేగంగా పడిపోతుండగా, హైదరాబాద్ నగరం సైతం తక్కువ కాదన్నట్లు మెర్యూరీ లెవెల్స్ దిగజారుతున్నాయి. శనివారం (డిసెంబర్ 18న) హైదరాబాద్ లో నమోదైన కనిష్ణ ఉష్ణోగ్రత ఈ దశాబ్దం(10 ఏళ్ల)లోనే అత్యల్పం అని వాతావరణ విభాగం తెలిపింది. అంతేకాదు, రాబోయే రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగి, ఉష్ణోగ్రతలు ఇంకాస్త దిగజారుతాయని, ఆ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ అధికారులు హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో దశాబ్దంలోనే డిసెంబర్ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్చెరులో 8.4, రాజేంద్రనగర్లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో 2015 డిసెంబర్ 13న హైదరాబాద్లో అతితక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఈసారి 8.2 డిగ్రీలకు పడిపోవడం ద్వారా దశాబ్దంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లయింది.
హైదరాబాద్ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రత మూడు నుండి నాలుగు డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. ఉపరితల గాలులు గంటకు ఆరు నుండి ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉంటాయని, డిసెంబర్ 21 వరకు నగరంలో ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. పిల్లలు, పెద్ద వయసువారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ వాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 6.5 డిగ్రీలు, మొయినాబాద్ మండలం రెడ్డిపల్లెలో 7.1 డిగ్రీలు, జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామంలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.