రీమేక్ చిత్రాలు రావడం అనేది టాలీవుడ్ కు కొత్తేమి కాదు. రిస్క్ ఉండదనే ఉద్దేశంతో మన స్టార్ హీరోలు కూడా రీమేక్ చిత్రాలను చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు సైతం రీమేక్ లు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం చాలా రీమేకులే సెట్స్ పై ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ సినిమాలు ఇతర బాషలలో హిట్ అయిన చిత్రాలనేది తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రీ ఎంట్రీలో ఆయన చేసిన వకీల్ సాబ్ చిత్రం కూడా రీమేక్ గా తెరకెక్కింది.
బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’రీమేక్ గా తెలుగులో తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక పవర్ స్టార్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా కూడా మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ గా తెలుగులో తెరకెక్కింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తమిళంలో హిట్ కొట్టిన మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమా కథే ‘వినోదాయ సితం’. సముద్రఖని దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా నచ్చడంతో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
సముద్రఖని ఈ కథను పవన్ కి వినిపించడం .. సినిమా చూపించడం జరిగిందనీ, ఆయన దర్శకత్వంలో ఈ సినిమా రీమేక్ లో చేయడానికి పవన్ ఉత్సాహాన్ని చూపించారనే టాక్ నడుస్తోంది. చనిపోయిన వ్యక్తికి తన జీవితంలో మిగిలిపోయిన కోరికలను తీర్చుకునేందుకు దేవుడు మరో 15 రోజుల సమయం ఇస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో
పవన్ తో పాటు మరో ముఖ్యమైన పాత్రను సాయితేజ్ చేయనున్నాడనేది తెలిసింది. సాయి తేజ్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతం సముద్రఖని మల్టీ స్టారర్ గా ఈ సినిమాని తీసేందుకు స్కిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ దర్శక, రచయిత త్రివిక్రమ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.