పాపులర్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ఇటీవలే జబర్దస్త్ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కామెడీ షో నుంచి ఆమె తప్పుకోవడం వెనుక రక రకాలైన కారణాలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను జబర్దస్త్ వంటి అత్యంత పాప్యులర్ షో నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనేది ఆమె స్వయంగా వెల్లడించింది. జబర్ధస్త్ షోకు మొదటి నుంచి అనసూయ యాంకర్ గా సేవలు అందించడం తెలిసిందే. ఈ షోకు ప్రజాదరణలో అనసూయ పాత్ర ఎంతో ఉందని చెప్పుకోవాల్సిందే. ఆమె అందచందాలు, హావభావాలు, వ్యాఖ్యానం షోకు అదనపు ఆకర్షణనిస్తాయి. అలాంటి షోను వీడి రావడం వెనుక తనకు ఎదురైన అనుభవాలను ఆమె బయటపెట్టింది.
షోలో భాగంగా తనపై వేసే పంచులు నచ్చడం లేదని ఆమె చెప్పింది. పంచులు నచ్చక ఎన్నో సందర్భాల్లో ముఖం మాడ్చుకున్నానని, అవేవీ షోలో కనిపించవని తెలిపింది. తనకు బాడీ షేమింగ్, వెకిలి చేష్టలు నచ్చవన్న అనసూయ.. క్రియేటివ్ ఫీల్డ్ అన్న తర్వాత ఇలాంటివి తప్పదని నిట్టూర్చింది. కానీ, ఇదే ఊబిలో చిక్కుకుపోవాలని తాను అనుకోవడం లేదని ఆమె పేర్కొంది. జబర్దస్త్ నుంచి బయటకు రావాలని రెండేళ్లుగా అనుకుంటున్నట్టు చెప్పింది. అంతేకానీ, నాగబాబు, రోజాగారు షో నుంచి వెళ్లిపోయారని చెప్పి, తాను కూడా బయటకు రాలేదని పేర్కొంది. నటనపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్టు తెలిపింది.
తనకు జబర్దస్త్ షో అంటే ఎంతో ఇష్టమంటూ.. సినిమాల్లో నటన కారణంగా, జబర్దస్త్ కు సమయం కుదరడం లేదని పేర్కొంది.బాడీ షేమింగ్ ఇష్టం లేదని చెబుతూ అనసూయ చేసిన ఈ కామెంట్స్ అభిమానులకు కోపాన్ని తెచ్చిపెట్టింది. అంత ఇష్టం లేని దానివి ఇన్ని రోజులు జబర్దస్త్ షో ఎందుకు చేసారు మేడమ్ అంటూ నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. హైపర్ ఆది స్కిట్స్ మొత్తం బాడీ షేమింగ్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి కదా మామ్ అంటూ మరి కొందరు అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. సినిమాలలో బిజీగా ఉంటే మరో ఛానల్ లో ఎలా పని చేస్తున్నారు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మల్లెమాల ఇచ్చే రెమ్యునిరేషన్ నచ్చకనే ఆమె జబర్దస్త్ షో నుంచి దూరం జరిగిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.