యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో మొదలైన వివాదం ఈ చిత్రానికి మంచి మైలైజీ తెచ్చి పెట్టింది. దాంతో ఈ సినిమాకు కావలసినంత పబ్లిసిటీ జరిగింది. ఈ చిత్రం సాధించిన విజయంతో విశ్వక్ సేన్ తన రెమ్యునిరేషన్ ను డబల్ చేశాడు. ప్రస్తుతం విశ్వక్ మూడు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఏక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా, తన సొంత దర్శకత్వంలో ధమ్కీ సినిమాలతో పాటు అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో ఓరి దేవుడా సినిమాలను చేస్తున్నాడు.
‘ఓరి దేవుడా’ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘ఓ మై కడవులే’ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. తమిళంలో అశోక్ సెల్వన్, రితిక సింగ్ జంటగా నటించిన ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకుడు. గొడవలతో విడిపోయిన భార్య భర్తలను దేవుడు ఎలా కలిపాడు అనే చిన్న పాయింట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. దర్శకుడు తన టేకింగ్ తో ఈ సినిమాను సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. ఇక ఈ సినిమాలో కీలకమైన దేవుడు పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. మూడు రోజులలో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసిన విజయ్ ఆ చిత్రానికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాడు. ఈ సినిమా సూపర్బ్ గా ఉందంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అప్పట్లో వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.
ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తు తెలుగులోనూ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో కీలకమైన దేవుడు పాత్ర కోసం చిత్ర యూనిట్ పలువురి పేర్లను పరిశీలించింది. విజయ్ సేతుపతిని కూడా సంప్రదించారు. కానీ డేట్స్ సమస్యతో ఈ సినిమాకు విజయ్ నో చెప్పేశాడు. దాంతో విక్టరీ వెంకటేష్ ను సంప్రదించారు. కథ నచ్చడంతో ఈ చిత్రంలో చేసేందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆయన ఈ నెల 16 నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా కోసం వెంకీ నాలుగు రోజుల డేట్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. మిథాలీ పార్కర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా తెరకెక్కిస్తోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనీ భావిస్తున్నారు.