మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. హీరోగా చరణ్ కి ఇది 15వ సినిమా అయితే, నిర్మాతగా దిల్ రాజుకి ఇది 50వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా 8 షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ముఖ్యమంత్రి తనయుడిగా చరణ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు సికింద్రాబాదులోని ‘విక్టోరియా మెమోరియల్ హాల్’ లో జరుగుతోంది. అక్కడ ఎన్నికల కౌంటింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
చరణ్ తో సహా మిగిలిన ప్రధాన పాత్ర దారులు పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ షూటింగ్ ను బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకున్నారు. విక్టోరియా మెమోరియల్ హోం స్కూల్లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా, బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆకుల శ్రీవాణి అక్కడికి వచ్చారు. స్కూల్లో తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్ కు అనుమతులు ఎలా ఇచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆమె ధ్వజమెత్తారు.
విద్యాబోధనను పక్కనబెట్టి సినిమా చిత్రీకరణకు అనుమతించడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం ధనార్జనకే ప్రాధాన్యత ఇస్తోందని ఆమె విమర్శించారు. దాంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆగిపోయిన ఈ షెడ్యూల్ ను వేరే చోట తీసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ‘వినయ విధేయ రామ’ తరువాత చరణ్ జోడీగా కియారా అద్వానీ చేస్తున్న రెండో సినిమా ఇది. ప్రకాశ్ రాజ్ శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తున్నారు.