మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే గురూజీ దర్శకత్వంలో నటించడం ఖాయమైంది. చరణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ చేసేందుకు చాలా రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ట్రై చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించి ఈ కాంబోలో సినిమా రావడం ఫిక్స్ అయింది. హ్యూమన్ ఎలిమెంట్స్ ను టచ్ చేస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే త్రివిక్రమ్ తో పని చేయాలని మన హీరోలు భావిస్తుంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు సూపర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పటివరకు చరణ్ తో పని చేయని సంగతి తెలిసిందే. ఈ కాంబోలో రానున్న సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.
వరుస సినిమాలతో .. వరుస హిట్లతో దూసుకుపోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిర్మాత సూర్యదేవర నాగవంశీ త్వరలోనే చరణ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. “పవన్ కల్యాణ్ తో ఈ సినిమా చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ, ఎవరికీ కూడా అలా అనిపించదు. అంతగా త్రివిక్రమ్ మార్పులు చేర్పులు చేశారు. మళ్లీ పవన్ తో మరో సినిమా చేయాలనుంది. ఆ విషయాన్ని గురించి ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇక చరణ్ అంటే నాకు చాలా ఇష్టం .. ఈ బ్యానర్లో ఆయనతో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఈ బ్యానర్లో హీరోగా చరణ్ చేసే సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారు’ అని ప్రకటించాడు.
త్రివిక్రమ్-చరణ్ కాంబోలో సినిమా రావడం ఖాయం కావడంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో త్రివిక్రమ్ #ssmb28 సినిమాని చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే చరణ్ సినిమాని త్రివిక్రమ్ సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నాడు. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలను పూర్తి చేసిన చరణ్ ప్రస్తుతం #rc15 సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే గౌతమ్ తిన్ననూరి చెప్పిన స్పోర్ట్స్ జానర్ లో చరణ్ నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమాని స్టార్ట్ చేయాలని చరణ్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం వర్గాలు చెబుతున్నాయి.