బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలకు స్వర్ణ యుగం మొదలైందని చెప్పకతప్పదు. ఇక్కడ ఏ సినిమా మొదలైనా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆ సినిమా విశేషాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక నిర్మాతల గురించి చెప్పేదేముంది భారీ మొత్తంలో చెల్లించి మన సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నారు. ఇక పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల అయిన పుష్ప సినిమా అయితే బాలీవుడ్ లో సునామి సృష్టించింది. పుష్ప సినిమా బాలీవుడ్ లో నయా రికార్డు క్రియేట్ చేయడంతో అక్కడి నిర్మాతలు మన తెలుగు సినిమా హక్కుల కోసం పోటీ పడుతుండటం విశేషం. పుష్ప ఎఫెక్ట్ తో ఎనర్జిటిక్ హీరో రామ్ చేస్తున్న సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది.
గత ఏడాది రెడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ ప్రస్తుతం బై లింగ్వల్ మూవీ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చేస్తున్న ద్విభాషా చిత్రం ‘ది వారియర్’. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లక్కీ చార్మ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ తన కెరీర్ లో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ పోస్టర్ మంచి రెస్పాన్స్ పట్టేసి సినిమాపై అంచనాలను పెంచింది. పోలీస్ ఆఫీసర్ లుక్ లో రామ్ ను చూసిన అభిమానులు ఇంకో సూపర్ హిట్ ఖాయమంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా కోసం తన మేక్ ఓవర్ లో మార్పులు చేసిన రామ్ మరోమారు సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడని తెలిసింది.
ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకొని మరో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఆ షెడ్యూల్ లో మెయిన్ క్రూ మీద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి చెందిన ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కి భారీ మొత్తంలో చెల్లించి ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా హక్కుల కోసం ఆ సంస్థ 16 కోట్లు చెల్లించడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. రామ్ కెరీర్లో ఇంత పెద్ద మొత్తం డబ్బింగ్ వెర్షన్ రైట్స్ కి లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఫస్ట్ లుక్ విడుదల కాగానే ఈ రేంజ్ లో బిజినెస్ జరగడంపై ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. సెట్స్ మీద ఉన్నప్పుడే రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.