హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో మదర్ సెంటిమెంట్‌ను హృదయంగా మలిచిన తాజా తెలుగు చిత్రం ‘ఎర్రచీర – ది బిగినింగ్’. ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, కేవలం భయపెట్టడానికే పరిమితం కాకుండా, భావోద్వేగాల్ని కూడా గట్టిగా తాకే ప్రయత్నం చేస్తుంది. భిన్నమైన కథ, కొత్త ఆలోచనలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను చివరి వరకూ ఉత్కంఠలో ఉంచుతుంది.
కథ ఏమిటంటే..
దాసు (సుమన్ బాబు) అవంతిక (కారుణ్య చౌదరి)ను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. ఆస్తి కోసం దాసు అమ్మమ్మ పన్నీ పార్వతిని అవంతిక హత్య చేయడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ పాపఫలితంగా అవంతిక ఒక పాపాత్మగా మారి, తన చనిపోయిన తల్లిని వెతుకుతూ భయంకర రూపంలో తిరుగుతుంటుంది.
ఇదే సమయంలో ట్రాన్స్‌ఫర్‌పై శ్వేతా సిటీకి వచ్చిన పోలీస్ ఆఫీసర్ శివకుమార్ (కమల్ కామరాజు) భార్యకు, ఎర్రచీరలో కనిపించే అవంతిక తన మరణించిన తల్లిలా అనిపిస్తుంది. ఈ అతీంద్రియ సంఘటనల వెనుక అసలు రహస్యం ఏమిటి?
శివశక్తికి ప్రసిద్ధుడైన సరిపోక త్రికోటేశ్వరస్వామి (సుమన్ బాబు మరో కీలక పాత్రలో) ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు? అన్నదే కథానాయక ప్రశ్న.
నటీనటుల ప్రతిభ
సుమన్ బాబు దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. ద్విపాత్ర ఛాయలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, తన పాత్రలో పూర్తిగా లీనమయ్యారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకు ప్రాణం పోసింది.
కమల్ కామరాజు పోలీస్ పాత్రలో సీరియస్, కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
కారుణ్య చౌదరి అవంతిక పాత్రలో హారర్ ఎలిమెంట్‌ను బలంగా పండిస్తూ భయాన్ని నిజంగా అనిపించారు.
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో భావోద్వేగాలకు మంచి బలం చేకూర్చారు.
ఆలీ, అన్నపూర్ణమ్మ, గీతా సింగ్, సత్యకృష్ణన్, భద్రం, జీవా, రఘుబాబు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
హారర్‌కు తగ్గ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చీకటి షేడ్స్‌తో రూపొందిన సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు భావోద్వేగంగా బాగా పండాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్లకు అతుక్కునేలా చేస్తాయి.
విశ్లేషణ
దర్శకుడు సుమన్ బాబు చింతల్ ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారని చెప్పడం సినిమాకు మరింత ఆసక్తిని జోడిస్తుంది. కథలోని కీలక మలుపులు, భావోద్వేగాల మేళవింపు సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రమైనప్పటికీ, కుటుంబమంతా కలిసి చూసేలా హారర్‌ను మితంగా చూపించడం ప్రశంసనీయం. హారర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్‌ల సమ్మేళనం సినిమాను చివరి వరకూ ఆసక్తికరంగా నడిపిస్తుంది.
మొత్తంగా
భయపెట్టే హారర్‌తో పాటు తల్లిపట్ల ఉన్న అనుబంధాన్ని హృదయానికి తాకేలా చెప్పిన సినిమా ‘ఎర్రచీర – ది బిగినింగ్’. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఎంపిక.
రేటింగ్: 3.5/5

