రవితేజ సినిమా అనగానే ఎంటర్ టైన్ మెంట్ పక్కా అని ఆడియన్స్ నమ్మకం. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ధమాకా వంటి ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ..చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో మూడో చిత్రం అయిన మిస్టర్ బచ్చన్ తో ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .హిందీలో 2018లో విడుదలైన “రెయిడ్” అనే చిత్రానికి రీమేక్ గా హరీష్ శంకర్ “మార్పులు” ప్రత్యేక ఆకర్షణగా రూపొందిన “మిస్టర్ బచ్చన్” పాటలు, ట్రైలర్ & ప్రమోషన్స్ సినిమాను ప్రేక్షకులకు బాగా చేరువయ్యేలా చేశాయి. మరి సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..
సినిమా కథ ఏంటంటే..
మిస్టర్ బచ్చన్ అలియాస్ రవితేజ నిజాయతీ పరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి అవినీతి సొమ్ము వెలికి తీస్తాడు. కానీ.., పైఅధికారులు మాత్రం బచ్చన్ ని సస్పెండ్ చేస్తారు. దీంతో.. బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వెళ్లిపోతాడు. అక్కడ జెక్కీ(భాగ్య శ్రీ)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి.. బచ్చన్ కి ఉద్యోగం లేదని అడ్డు చెప్తారు. సరిగ్గా ఇదే సమయంలో బచ్చన్ ని ఉద్యోగంలో చేరమని ఫోన్ వస్తుంది. దీంతో.. పెళ్లి సెట్ అయినా.. బచ్చన్ తన తదుపరి రైడ్ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. మొత్తం అధికారులని భయపెట్టే ముత్యం జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అనేది మిస్టర్ బచ్చన్ అసలు కథ.
మూవీ ఎలా ఉందంటే?..
సమాజంలో ఓ తప్పు జరుగుతూ ఉంటుంది. దానికి కారణమైన విలన్ చాలా పవర్ ఫుల్. అందరిని భయపెడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడు హీరో రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుండి ఆ ఇద్దరు ఎలా పోట్లాడుకున్నారు? ఇది అచ్చమైన అసలు సిసలు మాస్ కథ. చాలా ఏళ్లుగా ఈ పాయింట్ మీద కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఇక్కడ కొత్తగా చెప్పడానికి కథ కూడా ఏమి ఉండదు. కానీ.., కమర్షియల్ గా పక్కా వర్కౌట్ అయ్యే పాయింట్. కాకపోతే.. ఆ సక్సెస్ రావాలంటే హీరో ఎంత బలంగా ఉంటే.. విలన్ కూడా అంతే బలంగా నిలబడాలి. అప్పుడే ఈ పాయింట్ వర్కౌట్ అవుద్ది. కానీ.. మిస్టర్ బచ్చన్ లెక్క తప్పింది ఇక్కడే. ఓ హీరో విలన్ కి లొంగడు, ముఖ్యమంత్రిని లెక్క చేయడు, ప్రధానమంత్రిని పట్టించుకోడు. ఫ్రెండ్ సహకారంతో ఫ్యామిలీ టెన్షన్ ఉండదు. ఎదురుపడ్డ ప్రతిసారి విలన్ ని తన్నుకుంటూపోతుంటాడు. ఇక కథలో ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ఎక్కడ సాధ్యం అవుతుంది? కథనం ఆసక్తిగా ఎలా సాగుతుంది? అన్నిటికి మించి క్లైమ్యాక్స్ లో ఎలా కిక్ వస్తుంది? ఏమో ఈ ప్రశ్నలు అన్నిటికీ హరీశ్ శంకరే సమాధానం చెప్పాలి!
ప్లస్ పాయింట్స్..
మిస్టర్ బచ్చన్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ రవితేజ, ఆయన ఎనర్జీ అని చెప్పుకోవాలి. హీరోయిన అందం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. హీరోయిన్ ఎంట్రీతో మూవీ గ్లామర్ టర్న్ తీసుకోవడం స్మూత్ గా జరిగిపోయింది. రవి తేజ ఎనర్జీకి, హరీశ్ పవర్ ఫుల్ డైలాగ్స్ యాడ్ కావడంతో ఫస్ట్ ఆఫ్ సంతృప్తిగానే ముగుస్తుంది. ఇక టెక్నికల్ అన్నీ విషయాలు బాగున్నాయి. మేయర్స్ మ్యూజిక్ అదిరిపోయింది. గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ కొంతసేపు స్క్రీన్ ని షేక్ చేసేశాడు.
మైనస్ పాయింట్స్..
దర్శకుడు హరీశ్ శంకర్ సెకండ్ ఆఫ్ కథనంపై ఇంకాస్త ఎక్కువ శ్రద్ద వహించి ఉంటే బాగుండేది. కామెడీ ట్రాక్ అస్సలు పండకపోవడంతో బచ్చన్ ట్రాక్ తప్పేసే స్థితికి వచ్చేస్తుంది. హీరో, విలన్ మైండ్ గేమ్ కాస్త వన్ సైడ్ వార్ అయిపోవడంతో కథనంలో పట్టు తప్పింది. ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా క్లైమ్యాక్స్ కూడా సాధారణంగా ముగియడంతో మిస్టర్ బచ్చన్ అనుకున్న స్థాయిని అందుకోలేకపోయింది.
ఓవరాల్ గా చెప్పాలంటే మిష్టర్ బచ్చన్ మూవీ అన్ని మసాలాలు బాగా కుదిరినా.. ఆశించిన టేస్ట్ రాలేదని చెప్పాలి..
ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింట్ 2.5 అవుట్ ఆఫ్ 5