మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం లాల్ సింగ్ చడ్డా. దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత అమీర్ నటించిన చిత్రమిది. థుగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతో ప్రేక్షకులను నిరాశ పరిచిన అమీర్ ఎలాగైనా హిట్ సాధించాలనే ఉద్దేశంతో ఆస్కార్ విన్నింగ్ మూవీ ఫారెస్ట్ గంప్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఆ చిత్రానికి రీమేక్ గా ‘లాల్ సింగ్ చడ్డా’ రూపొందింది. అమీర్ అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ గతంలో అమీర్ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాకు చిక్కులు తెచ్చిపెట్టాయి. ఈ సినిమాను బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

దయచేసి తన చిత్రాన్ని బ్యాన్ చేయవద్దంటూ అమీర్ విజ్ఞప్తి చేసినా ఆ ప్రచారం ఏ మాత్రం ఆగకపోవడం గమనార్హం. నెగటివ్ ప్రచారాల మధ్య ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేకింగ్ వీక్ గా ఉండటంతో ఈ చిత్రం తొలి ఆట నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఆమిర్ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం తక్కువ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. చాలా ప్రముఖ సంస్థలు ఈ చిత్రానికి 2.5 రేటింగ్ మించి ఇవ్వలేదు. ఈ సినిమా పరాజయంతో నిరాశలో మునిగిపోయిన అమీర్ కు ‘ఆస్కార్’ నుంచి కొంత ఊరట లభించింది. హాలీవుడ్ క్లాసిక్‘ఫారెస్ట్ గంప్’కు అధికారిక హిందీ రీమేక్ అయిన ‘లాల్ సింగ్ చడ్డా’ను ఆస్కార్ గుర్తించింది. తమ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా మద్దతు తెలిపింది.

అస్కార్ అవార్డు పొందిన ఒరిజినల్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ మ్యాజిక్ ను హిందీలో తిరిగి ఎలా సృష్టించారో వివరించేలా వీడియో క్లిప్ ను షేర్ చేసింది. ‘రాబర్ట్ జెమెకిస్, ఎరిక్ రోత్ అందించిన కథ భారతీయుల ఆదరణ కూడా పొందింది. ఈ కథను అద్వైత్ చందన్‌, అతుల్ కులకర్ణి భారతీయతకు తగ్గట్టు మార్చుకున్నారు’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో రెండు చిత్రాల సన్నివేశాలను పోల్చింది. ఒరిజినల్ చిత్రంలోని సన్నివేశాలను ఎలా పునర్నిర్మించారో కూడా చూపుతూ కొన్ని సన్నివేశాలను ఆ వీడియోలో పొందుపరిచారు. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ హాన్స్ నటించిన ఫారెస్ట్ గంప్ 1994లో విడుదలై సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొత్తం13 ఆస్కార్‌లకు నామినేట్ కాగా ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ చిత్రంగా ఆరు అస్కార్ అవార్డులను గెలుచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *