యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సంతోషం కలిగించే వార్త ఇది. ఆస్కార్ అవార్డు నామినేషన్లలో 2022కు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఉండొచ్చని హాలీవుడ్ కు చెందిన ‘వెరైటీ మ్యాగజైన్’ అంచనా వేసింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ గిరిజన హక్కుల కోసం పోరాడిన ధీరుడు కొమురం భీం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటన అందరినీ మెప్పించే విధంగా ఉంటుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగా వసూల్ చేసి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. మరి ముఖ్యంగా ఈ చిత్రం విదేశాలలో మంచి ఆదరణ దక్కించుకోవడం విశేషం.
ఈ చిత్రంలో ఫెరోషియస్ నటన చూపిన ఎన్టీఆర్ కు దేశ విదేశాలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ‘కొమరం భీముడో’ పాటలో ఎన్టీఆర్ చూపిన అభినయానికి విదేశీ అభిమానులు ఫిదా అయిపోయారు. వారు ఎన్టీఆర్ పై తమ అభిమానాన్ని సోషల్ మీడియాలో కామెంట్స్ ద్వారా తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఇదే పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ ను ఉత్తమ నటుడి అవార్డు నామినేషన్లలోకి తీసుకోవచ్చని వెరైటీ మ్యాగజైన్ అంచనా వేస్తోంది. ‘ఆల్ కంటెండర్స్ లిస్ట్’లో ఉత్తమ నటుడి కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ పేరును పొందుపరిచింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దీనిపై సామాజిక మాధ్యమాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ ది గ్రేట్ అంటూ కొందరు అభిమానులు కామెంట్ చేస్తుండగా మరి కొందరు ఆస్కార్ ఫర్ ఎన్టీఆర్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. నటించిన ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంతోనే ఎన్టీఆర్ ఆస్కార్ నామినేషన్ పొందడం గ్రేట్ అంటూ మెజారిటీ నెటిజన్స్ అభిప్రాయపడుతుండటం విశేషం. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కోసం వెయిట్ పెరిగిన ఎన్టీఆర్ ప్రస్తుతం మేక్ ఓవర్ లో మార్పులు చేయడంలో జిమ్ చేస్తున్నారు. 10 కిలోలు తగ్గేందుకు ఆయన కసరత్తులు చేస్తున్నారు. టార్గెట్ పూర్తి కాగానే ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.