ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల యాడ్ ఫిలింస్ తో బిజీ అయ్యారు. ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ చిత్రీకరణలో పాల్గొన్న అల్లు అర్జున్, అనంతరం హరీశ్ శంకర్ డైరెక్షన్ లో మరో యాడ్ షూటింగ్ కు హాజరయ్యారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యాడ్ ఆస్ట్రాల్ పైపుల కోసం చేస్తున్నారు. ఈ యాడ్ షూటింగ్ థాయిలాండ్ లో జరగడం విశేషం. ఈ యాడ్ కోసం భారీ రెమ్యునిరేషన్ బన్నీకి ముట్టినట్లు చెబుతున్నారు. వన్ ఇయర్ అగ్రిమెంట్ తో బన్నీ 15 కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్లు చెబుతున్నారు.
తాజాగా ఈ యాడ్ కు సంబంధించి తన లుక్ ను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. చెవికి రెండు పోగులు, కొద్దిగా నెరిసిన జుట్టు, గడ్డం, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, నోటిలో సిగార్ తో రఫ్ లుక్ ఉట్టిపడేలా బన్నీ దర్శనమిస్తున్నాడు. బన్నీ న్యూ లుక్ స్టైలిష్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఉత్సాహానికి హద్దే లేకుండా పోయింది. ఈ ఫొటోను బన్నీ పంచుకున్న కాసేపట్లోనే అభిమానులు లైకులు, రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.. ఈ లుక్ లోనే పుష్ప-2 సినిమాలో బన్నీ కనిపించనున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మాసీ లుక్ సూపర్బ్ గా ఉండేలా డిజైన్ చేసిన హరీష్ శంకర్ పై అభిమానులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో బన్నీతో యాడ్స్ చేసేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతుండటం విశేషం. జొమాటో, హీరో మోటో కప్, రెడ్ బస్, హాట్ స్టార్, ఫ్రూటీ, colgate, 7up, జాయ్ అలూకాస్, లాట్ మొబైల్స్, రాపిడో లకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. వీటితో పాటు ప్రో కబడ్డీ లీగ్ కు కూడా ఆయన బ్రాండింగ్ చేశాడు. ఇక అల్లు అరవింద్ నేతృత్వంలో నడుస్తున్న ఆహా స్ట్రీమింగ్ మొబైల్ యాప్ కు కూడా ఆయన బ్రాండింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్స్ ను పక్కనబెడితే సోషల్ కాజ్ కోసం యాంటీ పొగాకు యాడ్స్ కూడా బన్నీ చేశాడు. ఒక వైపు సినిమాలు మరో వైపు యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్న బన్నీ పిక్ ఇటీవలే ఇండియా టుడే మ్యాగజైన్ తమ కవర్ పేజీగా వేయడంతోనే అల్లు అర్జున్ క్రేజ్ మనకు అర్ధమవుతోంది.