పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం’భీమ్లా నాయక్’ విడుదలకు రెడీ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా తరువాత పవన్ ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణ జరుపుకుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ పాత్రలో కనిపించనున్నాడు. పవన్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్ కు అవసరమైన భారీ సెట్స్ ను హైదరాబాద్ లో వేశారు.
ఈ నెల మూడవ వారం నుంచి పవన్ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నారు. శరవేగంగా సినిమాని పూర్తి చేసి మే నెలలో ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్నారు. ‘భవదీయుడు భగత్ సింగ్’ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాల తరువాత పవన్ తన మేనల్లుడు సాయి తేజ్ తో కలిసి మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ వినోదియ సిత్తం రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. సముద్రఖని ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి.
తన స్నేహితుడైన నిర్మాత రామ్ తాళ్లూరితో సినిమాని చేసేందుకు పవన్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో పవన్ ఆ సినిమాని రామ్ తాళ్లూరి బ్యానర్ లో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి చెందిన అధికారక ప్రకటన కూడా వచ్చేసింది. ఆ తరువాత ప్రాజెక్టును కూడా పవన్ లైన్లో పెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఖిలాడి’ దర్శక నిర్మాతలతో ఒక సినిమా చేయడానికి ఆయన ఓకే చెప్పినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. రమేష్ వర్మ చెప్పిన లైన్ నచ్చడంతో పూర్తి స్థాయి స్క్రిప్ట్ తో రమ్మని పవన్ చెప్పాడట. త్వరలోనే రమేష్ వర్మ ఫైనల్ స్క్రిప్ట్ ను పవన్ కు వినిపించనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. 2023 నాటికి తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి రాజకీయాలకు పూర్తి టైం కేటాయించాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.