కరాచీ: పాకిస్థాన్ వెటరన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్, భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మేనల్లుడు మహమ్మద్ హురైరా పాకిస్థానీ దేశవాళీ టోర్నీలో ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఖైద్ ఏ ఆజమ్ ట్రోఫీలో భాగంగా నార్తర్న్ జట్టు తరఫున బరిలోకి దిగిన 19 ఏళ్ల హురైరా.. బలూచిస్థాన్పై అజేయ త్రిశతకం(341 బంతుల్లో 311 నాటౌట్; 40 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థానీ క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.
హురైరాకు ముందు పాక్ లెజెండరీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఈ ఘనత సాధించాడు. మియాందాద్ 1975లో 17 ఏళ్ల 310 రోజుల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. హురైరా 19 ఏళ్ల 239 రోజుల వయసులో ఆ ఘనత సాధించాడు. ఓవరాల్గా పాకిస్థాన్ గడ్డపై ఇది 23వ ట్రిపుల్ సెంచరీ కాగా, ఆ ఘనత సాధించిన 22వ ఆటగాడిగా హురైరా నిలిచాడు. పాక్లో త్రిశకం బాదిన ఆటగాళ్లలో మైక్ బ్రేర్లీ(ఇంగ్లండ్), మార్క్ టేలర్(ఆసీస్), వీరేంద్ర సెహ్వాగ్(భారత్) ఉన్నారు.