ముంబై: ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్‌కు అరుదైన గుర్తింపు దక్కింది. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా వ్యవహరించే గౌరవం లభించింది. విరాట్ కోహ్లి.. ఐపీఎల్‌లో ఆర్సీబీ సారధ్య బాధ్యతలను వదులుపోవడంతో పాటు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడంతో.. ప్రస్తుత క్రికెట్‌లో కేన్ ఒక్కడే జాతీయ జట్టు సహా ఐపీఎల్ జట్టుకు నాయకత్వం వహించే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు.
న్యూజిలాండ్ వన్డే, టీ20, టెస్ట్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేన్‌ను.. ఇటీవలే సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ రీటైన్ చేసుకుంది. కాగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సైతం విలియమ్సన్‌లా మూడు ఫార్మాట్ల సారధిగా వ్యవహరిస్తున్నప్పటికీ.. పాక్ ఆటగాడు కావడంతో అతనికి ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభించకపోవచ్చు. భవిష్యత్తులో విరాట్ కోహ్లి టీమిండియా టెస్ట్ సారధ్య బాధ్యతలను వదులుకుంటే.. రోహిత్ శర్మకు విలియమ్సన్‌కు లభించిన గుర్తింపు లభిస్తుంది. రోహిత్ భారత పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతలతో పాటు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.