సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడవ సినిమా ఇది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునే దిశగానే త్రివిక్రమ్ తన కథతో సంసిద్ధమవుతున్నాడు. సినిమా ప్రకటన వచ్చి చాలా రోజులైనా ఈ సినిమా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు మహేష్ బాబు ఓ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈ సినిమా గురించి మహేష్ తాజాగా మాట్లాడుతూ “నాకు త్రివిక్రమ్ డైరెక్షన్ .. డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. ఒక సినిమాను అన్ని వైపులా నుంచి తీర్చిదిద్దుకుంటూ రావడం ఆయన ప్రత్యేకత. 12 సంవత్సరాల తరువాత మళ్లీ కాంబినేషన్ సెట్ అయింది. ఆయనతో కలిసి మళ్లీ పని చేయడానికి నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ చాలా కొత్తదనం ఉన్న కథను ఎంచుకున్నాడు. డిఫరెంట్ జోనర్లో ఈ సినిమా ముందుకు వెళుతుంది. ఇంతవరకూ తనుగానీ .. నేను గాని అలాంటి ఒక సినిమా చేయలేదు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉంటుందని హామీ ఇస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా టైం ట్రావెలింగ్ నేపథ్యంలో ఉండనుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రల కోసం కన్నడ సూపర్ స్టార్ రవిచంద్రన్, మలయాళ నటుడు జయరాం, తమిళ నటుడు సముద్ర ఖని, మరాఠి నటుడు సచిన్ కేల్కర్ ను తీసుకున్నారు. ఇక ప్రధానమైన మరో పాత్ర కోసం తెలుగు నటుడు తొట్టెంపూడి వేణును తీసుకున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లోనే హీరోయిన్స్ పూజ హెగ్డే, ప్రియాంక అరుళ్ మోహన్ జాయిన్ కానున్నారని తెలిసింది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తుండగా దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా పనులను శరవేగంగా పూర్తి చేసి సమ్మర్ కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.